Pawan Kalyan:వాలంటీర్లపై వ్యాఖ్యలు.. చిక్కుల్లో పవన్ కళ్యాణ్, కోర్టుకెక్కనున్న జగన్ ప్రభుత్వం
- IndiaGlitz, [Friday,July 21 2023]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చిక్కుల్లో పడ్డారు. వాలంటీర్లపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. పవన్ వ్యాఖ్యలు మహిళలను కించపరిచే విధంగా వున్నాయంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించింది. అంతేకాదు.. పవన్‌ను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతిస్తూ జీవో నెంబర్ 16ను ఏపీ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ విడుదల చేశారు. దీని ప్రకారం పవన్‌పై సీఆర్‌పీసీ 199/4 (బీ) కింద కేసులు నమోదు చేసేందుకు వీలు కలుగుతుతుంది.
వైసీపీ హయాంలో 30 వేల మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారన్న పవన్ :
అసలు పవన్ ఏమన్నారంటే.. వైసీపీ అధికారంలోకి వచ్చాక 30 వేల మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారని.. దీని వెనుక ఏదో పెద్ద కుట్ర దాగి వుందని కేంద్ర నిఘా వర్గాలు చెబుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ స్థాయిలో మానవ అక్రమ రవాణా జరగడానికి కారణం గ్రామ వాలంటీర్లేనని ఆయన ఆరోపించారు. వీరు సేకరిస్తున్న సమాచారం కొన్ని అసాంఘిక వర్గాలకు చేరుతోందన్నారు. ఒంటరి మహిళల సమాచారం సంఘ విద్రోహ శక్తులకు చేరడం వల్లనే ఈ ఘోరం జరిగిందన్నారు. దారి దోపిడి చేసే దొంగలకు, చెత్త పన్నుతో సహా అన్ని రకాల పన్నులను వేసి జనాన్ని దోపిడీ చేసే జగన్‌కు తేడా లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. జగన్‌కు విలువలు లేవని, ఆయనో క్రిమినల్ అని జనసేనాని వ్యాఖ్యానించారు.
పవన్‌కు ఏపీ మహిళా కమీషన్ నోటీసులు :
వారాహి విజయ యాత్రలో భాగంగా ఏలూరులో జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఏపీలో మహిళలు కనిపించకుండా పోతున్నారంటూ చేసిన వ్యాఖ్యలను మహిళా కమీషన్ సీరియస్‌గా తీసుకుంది. ఈ వ్యాఖ్యలపై 10 రోజుల్లోగా నోటీసులు ఇవ్వాలని, లేనిపక్షంలో క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. రాష్ట్రంలో ఆడపిల్లలు అదృశ్యమవుతున్నారని.. ఏ కేంద్ర నిఘా వ్యవస్థ చెప్పిందో సమాధానం ఇవ్వాలని కమీషన్ కోరింది. అలాగే తప్పిపోయినట్లుగా చెబుతున్న మహిళల వివరాలు ఇవ్వాలని , ఈ విషయం చెప్పిన కేంద్ర ప్రభుత్వ అధికారి ఎవరో కూడా తమకు తెలియజేయాలని ఆదేశించింది.