YS Jagan:అంగన్‌వాడీ వర్కర్లకు వైయస్ జగన్ ప్రభుత్వం శుభవార్త

  • IndiaGlitz, [Friday,December 22 2023]

అంగన్‌వాడీ వర్కర్లకు సీఎం జగన్ ప్రభుత్వం శుభవార్త అందించింది. తమ డిమాండ్లు నెరవేర్చాలని పది రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి చొరవ చూపింది. ఇందులో భాగంగా అంగన్‌వాడీ వర్కర్లు, సహాయకుల సేవల విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే అంగన్‌వాడీ సహాయకులను వర్కర్లుగా ప్రమోట్‌ చేసే వయోపరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది.

62 ఏళ్లు నిండిన అంగన్‌వాడీ వర్కర్లకు రూ.లక్ష, హెల్పర్‌లకు రూ.40వేలు సర్వీస్ ముగింపు ప్రయోజనాలను అందించనుంది.

ఇక వర్కర్లకు TA/DA నెలకు ఒకసారి, హెల్పర్లకు రెండు నెలలకు ఒకసారి TA/DA క్లెయిమ్ చేసుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది. గ్రామీణ/గిరిజన ప్రాంతాలలో ఉన్న 16,575 అద్దె భవనాలకు, పట్టణ సముదాయంలో ఉన్న 6,705 అద్దె భవనాలకు రూ.66.54 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది.

అంగన్‌వాడీ కేంద్రాలకు అవసరమైన చీపురులు, బకెట్లు, మగ్గులు, ఫినాయిల్, సబ్బులు, స్టేషనరీ లాంటి అవసరాలను తీర్చడానికి 48,770 మెయిన్ అంగన్వాడి సెంటర్స్‌కు రూ.500 చొప్పున, 6,837 మినీ అంగన్వాడి సెంటర్స్‌కు రూ.250 చొప్పున మొత్తం 55,607 సెంటర్లకి రూ.7.81 కోట్ల నిధులను మంజూరు చేసింది.

మరోవైపు సొంత భవనాల నిర్వహణ, గోడల పెయింటింగ్‌లు, చిన్నపాటి మరమ్మత్తుల కింద 21,206 అంగన్వాడి సెంటర్స్‌కు(ఒకొక్క కేంద్రానికి రూ.3వేల రూపాయల చొప్పున)రూ.6.36 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది.

మొత్తానికి అంగన్‌వాడీల డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం తక్షణమే రూ.80 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.