ప్రభుత్వ ఉద్యోగులకు వైఎస్ జగన్ గుడ్ న్యూస్..
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల నుంచి పూర్తి జీతాలు ఇవ్వాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు గురువారం నాడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ ఉండటంతో రాష్ట్రానికి ఆదాయం వచ్చే మార్గాలన్నీ మూసుకుపోయాయి. ఈ తరుణంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నది. దీంతో గత రెండు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు సగం జీతం, ఐఏఎస్‌లకు 40 శాతం, ప్రజా ప్రతినిధులకు అసలు జీతాలే ఇవ్వలేదు. ప్రస్తుతం 4.0 లాక్ డౌన్‌లో భాగంగా చాలా వరకు సడలింపులు ఇవ్వడంతో కాస్త ఆర్థిక పరిస్థితి గాడిన పడింది. ఈ క్రమంలో ఉద్యోగులకు పూర్తి జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రేపటికల్లా అందుబాటులోకి.. పూర్తి జీతం!
మే నెల పూర్తి జీతం ఇవ్వాలని ఇందుకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి ఫైనాన్స్, ట్రెజరీకి గురువారం మధ్యాహ్నం ఆదేశాలు అందాయి. ఆదేశాలు రాగానే ట్రెజరీ సాఫ్ట్‌వేర్‌లో సిఎఫ్ఎంఎస్ మార్పులు చేసింది. ఇవాళ సాయంత్రం లేదా రేపటికల్లా సిఎఫ్ఎంఎస్‌లో మార్పులు అందుబాటులోకి వస్తాయి. దీంతో ఈ నెల నుంచి ఉద్యోగులకు పూర్తి జీతాలు అకౌంట్‌లో పడనున్నాయి. కాగా.. ఇదివరకు సగం జీతమే ఇచ్చిన ప్రభుత్వం.. ఆ మిగతా జీతం చెల్లింపుల విషయమై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. కాగా.. సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
కళకళలాడిన సెక్రటేరియట్..
కాగా ఇప్పటికే 100 శాతం ఉద్యోగులతో సచివాలయానికి రావాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. గురువారం నాడు రాష్ట్ర సచివాలయం ఉద్యోగులతో కళకళలాడింది. విజయవాడ, గుంటూరు నుంచి ప్రత్యేక బస్సుల్లో ఉద్యోగులు వచ్చి విధులు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ నుంచి వచ్చే ఉద్యోగుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని సీఎస్ నీలం సాహ్నికి ఉద్యోగులు వినతి పత్రం ఇచ్చారు. మరోవైపు తగు జాగ్రత్తలు తీసుకుని ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout