రివర్స్ టెండరింగ్‌పై జగన్ తొలిసారి స్పందన..
- IndiaGlitz, [Wednesday,September 25 2019]
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన రివర్స్ టెండరింగ్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వంపై వైసీపీ నేతలు ప్రశంసల జల్లు కురిపిస్తుంటే.. విపక్ష టీడీపీ నేతలు మాత్రం తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై వైఎస్ జగన్ తొలిసారి స్పందించారు. ‘ఏపీలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాము. వ్యవస్థలను సరిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నాం. పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష, రివర్స్ టెండరింగ్ చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. రూ.782 కోట్ల ప్రజాధనం ఆదా చేశాం. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ న్యాయ సమీక్ష, రివర్స్ టెండరింగ్ విధానాలు లేవు’ అని జగన్ చెప్పుకొచ్చారు.
పీపీఏ విధానాలు కూడా!
‘విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)పైనా విప్లవాత్మక విధానాలు చేపట్టాం. అధిక ధరలకు చేసుకున్న పీపీఏలపై సమీక్ష చేయకపోతే డిస్కంలు నిలదొక్కుకోలేవు. విద్యుత్ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయని పారిశ్రామిక వేత్తలు వెనకడుగు వేసే పరిస్థితి ఉంది. పరిశ్రమలకు ఇచ్చే కరెంట్ ఛార్జీలను ఇంకా పెంచే అవకాశం కూడా లేదు. విద్యుత్ రంగంలో పరిస్థితులను సరిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నాం’ అని వైఎస్ జగన్ తేల్చిచెప్పారు.
ప్రభుత్వమే చెల్లిస్తుంది..!
‘మేనిఫెస్టోలోని అంశాలు, ప్రజా సంకల్పయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ప్రజలను ఆదుకునేందుకు అనేక పథకాలు అమలు చేస్తున్నాం. ప్రభుత్వం, బ్యాంకర్లు కలిస్తేనే క్రెడిబిలిటీ నిలబడుతుంది. ప్రజలను ఆదుకునేందుకు అనేక పథకాలు అమలు చేస్తున్నాం. వివిధ పథకాల కింద ప్రభుత్వం అనేక మందికి నిధులు ఇస్తుంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లిస్తుంది. ఈ విషయంలో బ్యాంకర్లు ఏం కోరినా చేసేందుకు సిద్ధంగా ఉన్నాము’ అని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.
సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సదస్సు జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కన్నబాబు, అధికారులు పాల్గొన్నారు. ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో సీఎం జగన్ బ్యాంకర్లను ఉద్దేశించి మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.