భావోద్వేగంతో ప్రసంగం.. పెన్షన్‌పై జగన్ తొలి సంతకం.. మీడియాకు వార్నింగ్!

  • IndiaGlitz, [Thursday,May 30 2019]

అవినీతి రహిత పాలన అందించేందుకు పాలనలో విప్లవాత్మక మార్పుల దిశగా అడుగులు వేస్తానని.. ప్రజలందరి ముఖాల్లో సంతోషం నింపడమే ధ్యేయంగా పనిచేస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. నవ్యాంధ్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కార్యక్రమంలో ఆయన భావోద్వేగంతో మాట్లాడారు. ప్రభుత్వ పథకాల కోసం ఎవరూ లంచాలు ఇవ్వాల్సిన పనిలేదు. లంచాలు అడిగితే సీఎం ఆఫీస్‌కే ఫిర్యాదు చేసే విధంగా చర్యలు చేపడుతాము. అవ్వాతాతల ఆశీస్సులు కోరుతూ పెన్షన్‌ రూ. 2500 పెంచుతూ తొలి సంతకం చేస్తున్నాను. అదే విధంగా మేనిఫెస్టో ఆధారంగా పాలన చేస్తాను. ఆగస్టు 15 నాటికి 4 లక్షల గ్రామ వాలంటీర్‌ ఉద్యోగాలు ఇస్తాను. కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి సీఎం ఆఫీస్‌కే ఫిర్యాదు చేసే అవకాశం ప్రజలకు కల్పిస్తాను. గాంధీ జయంతి రోజు నాటికి గ్రామ సెక్రటేరియట్‌లో పది మందికి ఉద్యోగాలు కల్పిస్తాను. అక్షరాల మరో 1.60 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మాటిస్తున్నాను. పాలనలో పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు ప్రక్షాళన చేస్తానని హామీ ఇస్తున్నాను అని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.

వైఎస్‌ జగన్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే...

వైఎస్‌ జగన్‌ అనే నేను ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తూ ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తున్నాను. 3648 కిలోమీటర్లు ఈ నేల మీద నడిచినందుకు, మీతో కలిసి నడిచినందుకు, ఆకాశమంతటి విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. వేదిక మీద ఉన్న పెద్దలు కేసీఆర్, స్టాలిన్, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమసుంమాజలి. పదేళ్లుగా నా రాజకీయ జీవితంలో 3648 కిలోమీటర్ల పాదయాత్రలో పేదలు పడిన కష్టాలు చూశాను. పేదలు, మధ్య తరగతి ప్రజలు అలమటిస్తున్న కష్టాలు విన్నాను. మీ కష్టాలు చూసిన తరువాత ఈ వేదికపై నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ ఇవాళ మాట ఇస్తున్నాను.

మీ కష్టాలు చూశాను. మీ బాధలు నేను విన్నాను. మీ అందరికి చెబుతున్నాను. నేను ఉన్నానని చెబుతున్నాను. అందరి ఆశలు, ఆకాంక్షలు పూర్తిగా పరిగణలోకి తీసుకుంటూ కేవలం రెండే రెండు పేజీలతో మేనిఫెస్టోను తీసుకొచ్చాం. గత ప్రభుత్వాలు, పాలకుల మాదిరిగా పేజీలకు పేజీలుగా మేనిఫెస్టో తీసుకురాలేదు. ఎన్నికలు అయిపోయిన తరువాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసేలా చేయలేదు. మేనిఫెస్టో అంటే మనం ఎన్నుకున్న ముఖ్యమంత్రి మనకోసం ఏం చేస్తారన్నది ప్రజలకు గుర్తు ఉండే విధంగా కేవలం రెండే రెండు పేజీలతో మేనిఫెస్టో తీసుకువచ్చాను. మీ కళ్ల ముందు పెట్టాను. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని ఖురాన్‌గా, బైబిల్‌గా, భగవత్‌గీతాగా భావిస్తానని, మేనిఫెస్టోను ఊపిరిగా భావిస్తానని మాట ఇస్తున్నాను అని సీఎం జగన్ హామీ ఇచ్చారు.

వైయస్‌ఆర్‌ పింఛన్‌ కానుకపై మొదటి సంతకం..

మేనిఫెస్టోను ముందుకు తీసుకెళ్తూ నవరత్నాల్లో మీ అందరికి మాటిచ్చినట్లుగానే ఒక అంశం గురించి చెబుతున్నాను. ఈ రోజు ఆ అవ్వాతాతల ఆశీస్సులు తీసుకునేందుకు.. నాలుగేళ్ల పది నెలల కాలం వరకు చూశాం. ఐదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబడితే..ఆ నాలుగేళ్ల పది నెలల కాలంలో అవ్వతాతల పింఛన్‌ రూ.1000 అనే మాట విన్నాం. ప్రతి అవ్వకు ఇవాళ చెబుతున్నాను. ఎన్నికల మేనిఫెస్టోలో నవరత్నాల్లో భాగంగా ప్రతి అవ్వతాతలకు మాటిచ్చాను. పింఛన్‌ రూ.3 వేలకు పెంచుతూ పోతానని మాట ఇచ్చాను. ఆ మాట నిలబెట్టుకుంటూ ఇవాళ మొట్ట మొదట సంతకం చేస్తున్నాను. అవ్వతాతల పింఛన్‌ అక్షరాల రూ.2250లతో మొదలుపెడుతున్నాను. వైఎస్‌ఆర్‌ పింఛన్‌ కానుకగా మొదటి సంతకం పెడుతున్నాను. రేపటి సంవత్సరం రూ.2500, ఆ తరువాత రూ.2750, ఆ తరువాత రూ. 3 వేలకు పింఛన్‌ పెంచుతానని హామీ ఇస్తున్నాను అని ప్రతి అవ్వతాత ఆశీస్సులను సీఎం కోరారు.

నవరత్నాలు అందరికీ అందాలి..

నవరత్నాల్లో మనం చెప్పిన అంశం ప్రతి ఒక్కరికి అందాలి. కులాలు చూడకూడదు. మతాలు, రాజకీయాలు చూడకూడదు. ప్రతి ఒక్కరికి అందాలి. ఇది జరగాలంటే వ్యవస్థలో విప్లవాత్మక మార్పు రావాలి. ఆగస్టు 15 నాటికి అక్షరాల మన గ్రామాల్లో గ్రామ వాలంటీర్లుగా అక్షరాల నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని మాట ఇస్తున్నాను. ప్రభుత్వ పథకాలను నేరుగా డోర్‌ డెలివరీ చేసేందుకు వీలుగా, లంచాలు లేని పరిపాలన దిశగా అడుగులు వేస్తూ ప్రతి గ్రామంలో ..50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ను ఏర్పాటు చేస్తాం.

చదువుకున్న పిల్లలు, సేవ చేయాలని ఆరాటపడే పిల్లలకు గ్రామ వాలంటీర్లుగా ఉద్యోగాలు ఇస్తాం. వారికి నెలకు రూ.5 వేలు గౌరవ వేతనం ఇస్తాం. ప్రజలకు ఇవ్వాల్సిన ఏ పథకంలో కూడా ఎటువంటి కక్కుర్తి, లంచాలు ఉండకూడదని రూ.5 వేలు జీతం ఇస్తాం. వారికి మెరుగైన ఉద్యోగం వచ్చేవరకు గ్రామంలో సేవలు అందించవచ్చు. ప్రభుత్వ పథకాలు ఏ ఒక్కరికి అందకపోయినా ప్రభుత్వ సేవలు అందకపోయినా, ఎక్కడైనా పొరపాటున లంచాలు అడిగినా ఒక కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తాం. లంచాలు అడిగినా, ప్రభుత్వ పథకాలు అందకపోయినా నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్‌ చేసి చెప్పవచ్చు అని జగన్ స్పష్టం చేశారు.

హామీ ఇస్తున్నా..!

పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే దిశగా గ్రామ సచివాలయాలు తీసుకువస్తాం. మీ గ్రామంలోనే అక్షరాల పది మందికి గ్రామ సెక్రటెరియట్‌లో ఉద్యోగాలు ఇస్తాం. ఈ కార్యక్రమం అక్షరాల గాంధీ జయంతి అక్టోబర్‌ 2వ తేదీలోగా భర్తీ చేస్తాం. గ్రామాల్లో పది మందికి ఉద్యోగాలు ఇస్తాం. మీకు పింఛన్లు, రేషన్‌కార్డులు కావాలన్నా.. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ కావాలన్నా..ఏది కావాలన్నా కూడా మీరు గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లోనే మంజూరు చేస్తామని హామీ ఇస్తున్నా..లంచం అన్నదే లేకుండా, రెకమొండేషన్‌కు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందజేస్తామని ముఖ్యమంత్రిగా హామీ ఇస్తున్నా. గ్రామ వాలంటీర్లు సెక్రటరీయట్‌తో అనుసంధానం అవుతారు. నేరుగా సంక్షేమ పథకాలు డోర్‌ డెలీవరి చేస్తారని హామీ ఇస్తున్నాను. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నవరత్నాల్లో చెప్పిన అన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తాను అని సీఎం జగన్ హామీ ఇచ్చారు.

అన్నీ తగ్గిస్తాం..!

ఏపీ ముఖ్యమంత్రిగా ఆరు కోట్ల ప్రజలకు ఈ వేదిక మీద నుంచి ఇంకొక హామీ ఇస్తున్నాను. రాష్ట్రంలో స్వచ్చమైన, అవినీతి లేని పాలన, వివక్ష లేని పాలనకోసం పై నుంచి కింద వరకు పూర్తిగా ప్రక్షాళన చేస్తానని మాట ఇస్తున్నాను. అవినీతి జరిగిందో, ఏయే పనుల్లో అవినీతి జరిగిందో ఆ కాంట్రాక్టులు అన్నీ కూడా రద్దు చేస్తాం. అదే కాంట్రాక్టు ఎక్కువ మంది పాలు పంచుకునే విధంగా పూర్తిగా మార్చుతాం. ఎక్కువ మంది టెండర్లలో పాలు పంచుకునేందుకు రివర్స్‌ టెండర్స్‌ పిలుస్తాం. టీడీపీ ప్రభుత్వం ఇంత లంచాలు తీసుకుందని మీ ముందు పెడతాం. ఆ కాంట్రాక్టుల్లో 20 శాతం మిగిలితే మీ కళ్ల ముందే చూపిస్తాం. కరెంటు పేరుతో దోచుకున్న ప్రభుత్వాన్ని చూశాం. అక్షరాల యూనిట్‌ రూ.6 చొప్పున కొనుగోలు చేశారు. కరెంటు చార్జీలు తగ్గిస్తాం. వ్యవస్థలోకి పారదర్శకత తీసుకువస్తాం అని ఈ సందర్భంగా జగన్ చెప్పుకొచ్చారు.

మీడియా వార్నింగ్..!

కొత్త కాంట్రాక్టులు పారదర్శకంగా తీసుకువచ్చేందుకు రేపే హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ను కలిసి జూడిషియల్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలని కోరుతాం. టెండర్లకు వెళ్లకముందే జ్యూడిషియల్‌ కమిషన్‌ ద్వారా మార్పులు చేస్తాం. రాష్ట్రంలో మీడియా పక్షపాత దోరణిలో వ్యవహరిస్తోంది. ఆ రాతలు సరికాదు. పూర్తిగా టెండర్లను పారదర్శకంగా ఏర్పాటు చేస్తాం. మీడియా వక్రీకరించి వార్తలు రాస్తే..మా ప్రభుత్వం న్యాయపోరాటం చేస్తుంది. ఆరు నెలల నుంచి ఏడాది వ్యవధిలో టైం ఇవ్వండి. అవినీతిని నిర్మూలిస్తానని మాటిస్తున్నాను.

ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏది కూడా దేహి అని అడగాల్సిన పని ఉండదు. కులం, మతం, రాజకీయాలు, పార్టీలు చూడం. అందరూ నావాళ్లే అని భావిస్తాను. చెరగని చిరునవ్వుతో ఆప్యాయతలు చూపించి, నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ,,ఆశీర్వదించిన దేవుడికి, నాన్నగారికి, నా తల్లికి పాదాభివందనం చేస్తూ మీ అందరికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.

More News

అజయ్ 'స్పెషల్' జూన్ 14న రిలీజ్

తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని నటుడు అజయ్. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టి, దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో

హృదయాలను ఏలే ‘దొరసాని’

రియలిస్టిక్ అండ్ ఇంటెన్సిటీ ఉన్న కథలకు ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. అలాంటి ఓ రియలిస్టిక్ స్టోరీతో వస్తోన్న చిత్రమే ‘దొరసాని’.

సుమంత్ కొత్త సినిమా!!

నితిన్, నాని, నిఖిల్ తదితర హీరోలతో పలు హిట్ చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు తన మిత్రుడు పి.జగన్ మోహన్ రావుతో కలిసి ప్రముఖ కథానాయకుడు సుమంత్

నా క‌థ‌ను నేనే తెర‌ పై చూసుకోవ‌డం అదృష్టంగా భావిస్తున్నాను - చింత కింద మల్లేశం

ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత చింత‌కింది మ‌ల్లేశం జీవిత‌క‌థ‌ను ఆధారంగా చేసుకుని రూపొందుతున్న చిత్రం 'మ‌ల్లేశం'. వెండితెర‌ పై ఈయ‌న పాత్ర‌లో ప్రియ‌దర్శి క‌నిపించ‌నున్నాడు.

మోదీ కేబినెట్‌లోకి కిషన్‌రెడ్డి.. గుడ్ న్యూస్ చెప్పిన షా

ఢిల్లీ: తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీచేసి గెలిచి నిలిచిన బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డికి..