ఇసుక కొరతపై వైఎస్ జగన్ కీలక నిర్ణయం.. కండిషన్స్ అప్లై
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో నెలకొన్న ఇసుక కొరతకు శాశ్వత పరిష్కారమార్గం చూపాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం నాడు ‘స్పందన’ కార్యక్రమంపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సంచలన నిర్ణయం తీసుకుని.. పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ 14 నుంచి 21వ తేదీ వరకు ఇసుక వారోత్సవాలు జరపాలని అధికారులను జగన్ ఆదేశించారు.
రెండేళ్లు జైలు శిక్ష!
‘గతంలో సరాసరి ఇసుక డిమాండ్ 80 వేల టన్నులు ఉండేది. వరదల కారణంగా రీచ్‌లు మునిగి టార్గెట్‌ను చేరుకోలేకపోయాం. కానీ, గత వారం రోజులుగా ఈ పరిస్థితి మెరుగుపడింది. 1.20 లక్షల టన్నులకు రోజువారీ ఇసుక సరఫరా పెరిగింది. ఇసుక రీచ్‌ల సంఖ్య సుమారు 60 నుంచి 90కి చేరింది. 1.2 లక్షల టన్నుల నుంచి 2 లక్షల టన్నుల వరకు వారం రోజుల్లో పెంచాలి. ఇసుక వారోత్సవాలు పూర్తయ్యేలోపు 180కిపైగా స్టాక్ పాయింట్లు పెంచాలి. నియోజకవర్గాల వారీగా రేటు కార్డును ప్రకటించాలి. రేపు, ఎల్లుండిలోగా రేటు కార్డు డిసైడ్ చేసి జిల్లాల వారీగా రేటు కార్డులపై ప్రచారం చేయాలి. జాయింట్ కలెక్టర్లను ఇన్‌చార్జిలుగా పెట్టాం కాబట్టి.. వారు స్టాక్‌పాయింట్లను పూర్తిగా పెంచాలి. ఎవరైనా ఎక్కువ రేటుకు అమ్మితే పెనాల్టీ, సీజ్ చేయడమే కాదు.. 2 ఏళ్ల వరకూ జైలుశిక్ష కూడా విధించడం జరుగుతుంది. దీనికి రేపు కేబినెట్ ఆమోదం కూడా తీసుకుంటాం’ అని అధికారులను జగన్ ఆదేశించారు.
సెలవులు తీసుకోవద్దు!
‘ఇసుక కొరత తీరేంత వరకూ ఎవ్వరూ కూడా సెలవులు తీసుకోకూడదు. ఇసుక తవ్వకాల్లో, విక్రయాల్లో కాని సిబ్బంది సెలవులు తీసుకోకుండా పనిచేయాలి. సరిహద్దుల్లో ప్రతి చోటా చిన్నరూట్లు, పెద్ద రూట్లు అని తేడా లేకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా వీడియో కెమెరాలు కూడా అమర్చాలి. 10 రోజుల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు, సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తికావాలి. కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్‌అండ్‌బీ, ఏపీ ఎండీసీ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి. అక్రమ రవాణా, ప్రకటించిన ధరలకు మించి ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలి’ అని అధికారులను సీఎం ఆదేశించారు.
మొత్తానికి చూస్తే ఇసుక కొరతపై జగన్ కీలక నిర్ణయమే తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇదే నిర్ణయం కాస్త ముందు తీసుకొని ఉంటే.. భవన కార్మికుల ఆత్మహత్యలు జరిగుండేవి కాదేమో మరి. కాగా.. ఇసుక కొరతను నిరసిస్తూ టీడీపీ, బీజేపీ, జనసేన ఆందోళనలు, నిరసనలు చేపట్టిన విషయం విదితమే. ఇప్పటికే ఈ విషయమై జనసేన అధినేత పవన్ లాంగ్ మార్చ్ నిర్వహించగా.. ఎల్లుండి అనగా నవంబర్-14న టీడీపీ అధినేత చంద్రబాబు దీక్ష చేపట్టబోతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments