జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. పరీక్షలు లేకుండానే పై తరగతికి!
- IndiaGlitz, [Thursday,March 26 2020]
కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో ఏపీలోని జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు పరీక్షలను రద్దు చేసింది. ఈ తరగతులకు చెందిన విద్యార్థులను తదుపరి తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్టు ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియా ముఖంగా ప్రకటించారు. అలాగే.. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని వారి ఇళ్లకే పంపిస్తామని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. వాలంటీర్ల ద్వారం విద్యార్థులకు ఈ మధ్యాహ్యా భోజనాన్ని అందించనున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం శ్రేయస్కరం కాదని, అది విద్యార్థులకు, అధికారులకు కూడా మంచిది కాదని మంత్రి తెలిపారు.
పదో తరగతి పరీక్షలపై..
ఈనెల 31 నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని మరోసారి ప్రస్తావించిన మంత్రి.. ఈ నెల 31న జరిగే సమీక్ష తరువాత పదోతరగతి పరీక్షలు షెడ్యూల్‌ను విడుదల చేస్తామన్నారు. పరీక్షల విషయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనలకు గురికావద్దని మంత్రి సూచించారు. కాగా.. పది పరీక్షలు వాయిదా వేయాలని ఈ నెల 24న ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలవ్వగా తీర్పు రాకమునుపే పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.