YS Jagan: వాళ్లది ఒక్కటే ఏడుపు.. చంద్రబాబు, పవన్‌పై సీఎం జగన్ విమర్శలు..

  • IndiaGlitz, [Thursday,December 14 2023]

మీ బిడ్డ ప్రజలకు మంచి చేస్తుంటే చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు ఒక్కటే ఏడుస్తు్‌న్నారని ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో నిర్మించిన డా.వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం ఉద్దానంలో రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ తాను ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చి ఉంటానంటే ఈ దుష్టచతుష్టయం ఏడుస్తుందని తెలిపారు. చంద్రబాబు ఐదేళ్లు అధికారంలో ఉండి ఉత్తరాంధ్రకు ఏమైనా మంచి చేశారా? ప్రశ్నించారు.

ఎన్నికలు వచ్చే సరికి ఎత్తులు, పొత్తులు, చిత్తుల మీదే చంద్రబాబు ఆధారపడతారని ఎద్దేవా చేశారు. పక్క రాష్ట్రంలో ఉండే నాన్ లోకల్స్ చెప్పినట్లే ఈ రాష్ట్రంలో జరగాలంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో తన దత్తపుత్రుడిని చంద్రబాబు బరిలో నిలిపారని ఆరోపించారు. ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తానని ప్యాకేజీ స్టార్ తెలంగాణలో డైలాగులు కొడతాడన్నారు. తెలంగాణలో పోటీ పెడితే అక్కడ ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్దమనిషికి రాలేదని సెటైర్లు వేశారు. ఏపీలో ఇద్దరికీ ఒక సొంత నియోజకవర్గం కూడా లేదన్నారు. ఈ ప్రాంతంలో ఏ అభివృద్ధి కార్యక్రమం వస్తుందన్నా వీళ్లు ఏడుస్తారని తెలిపారు. ఈ రాష్ట్రంలో దొంగల ముఠాగా తయారై దోచుకుని తింటానికి ఇతర రాష్ట్రాల నుంచి వస్తుంటారని జగన్ మండిపడ్డారు.

పాదయాత్రలో భాగంగా ఉద్దానం ప్రజల బాధను చూశానని.. అప్పుడు తాను ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు హామీలు నెరవేర్చానని తెలిపారు. ఉద్దానం అంటేనే ఉద్యానవనం అని.. దానిని అలాగే చూడాలని తాను భావించానని అన్నారు. ఇచ్చిన హామీ నెరవేర్చినందుకు సంతృప్తిగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలందించేందుకు ఇక్కడ కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేశామన్నారు. రానున్న రెండు నెలల్లో కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కూడా చేసేలా చర్యలు తీసుకుంటామని జగన్ హామీ ఇచ్చారు. అలాగే సుజలధార పథకం ద్వారా దాదాపు 7 మండలాల్లోని 807 గ్రామాలకు సురక్షిత మంచి నీటి సరఫరా జరగనుందని వెల్లడించారు.