చంద్రయాన్-2 ఫెయిల్‌పై జగన్, బాబు రియాక్షన్ ఇదీ..
- IndiaGlitz, [Saturday,September 07 2019]
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగానికి చివరిదశలో అవాంతరాలు ఎదురైన విషయం విదితమే. వాహకనౌక నుంచి విడిపోయిన ల్యాండర్ విక్రమ్.. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా భూమి నుంచి సిగ్నల్స్ తెగిపోయాయి. చివరి నిమిషంలో విఫలమవ్వడంతో ప్రధాని మోదీతో సహా, ఇస్రో ఛైర్మన్, శాస్త్రవేత్తలు, తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు.
వైఎస్ జగన్ రియాక్షన్ ఇదీ...
‘మనం చంద్రుడిని దాదాపుగా అందుకున్నాం. భారత్ తన శాస్త్రవేత్తల పట్ల గర్వపడుతోంది. ఇలాంటి చిరు అడ్డంకి మన విజయానికి పునాది కావాలి. భారత్ మొత్తం ఇస్రో టీమ్‌కు అండగా నిలుస్తూ.. వాళ్లు చేసిన అసాధారణ, అద్భుతమైన కృషిని ప్రశంసిస్తోంది’ అని జగన్ తన ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.
చంద్రబాబు రియాక్షన్ ఇదీ...
‘భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 కోసం ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన కృషి, సవాళ్లను ఎదుర్కొన్న తీరుకు భారత్ గర్విస్తోంది. ల్యాండర్ విక్రమ్ విషయంలో ఆఖరి క్షణంలో అవరోధం ఎదురైనా ఇప్పటివరకూ సాధించింది తక్కువేమీ కాదు. టీమ్ ఇస్రో.. దేశమంతా మీవెంటే ఉంది. మున్ముందు మనం అనుకున్నది సాధిస్తాం’ అని చంద్రబాబు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.