AP Elections: ఎన్నికల సమరంలోకి జగన్, బాబు, పవన్.. రాష్ట్రమంతా హోరెత్తనున్న ప్రచారం..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరుకుంది. పోలింగ్‌కు కేవలం 50 రోజులు మాత్రమే సమయం ఉండటంతో అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ఈ మేరకు రూట్ మ్యాప్ ఖరారు చేసుకున్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రమంతా నాయకుల ప్రచారంతో దద్దరిల్లనుంది. ఇచ్ఛాపురం నుంచి హిందూపురం వరకు నాయకులు పర్యటించనున్నారు.
'మేమంతా సిద్ధం' పేరుతో సీఎం జగన్ బస్సు యాత్ర..
ముందుగా సీఎం జగన్ 'మేమంతా సిద్ధం' పేరుతో బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ మేరకు వైసీపీ నేతలు షెడ్యూల్ ఖరారు చేశారు. ఈనెల 27న ఇడుపులపాయ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర 20 రోజుల పాటు నిర్వహించనున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఓ సభ ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. ఉదయం పూట ప్రజలతో మమేకం.. మధ్యాహ్నం నేతలతో సమావేశాలు.. సాయంత్రం బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఈ యాత్రలో భాగంగా తమ ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను తెలియజేయడంతో పాటు మళ్లీ ఎందుకు అధికారం అప్పగించాలనే దానిపై ప్రజలకు వివరించనున్నారు.
'ప్రజాగళం' పేరుతో చంద్రబాబు ప్రచారం..
ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ నెల 26 నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. 'ప్రజాగళం' పేరుతో మొత్తం 20 రోజుల పాటు ఆయన ఏకబిగిన ప్రచారం చేయాలని నిర్ణయించారు. చిత్తూరు జిల్లా నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 24, 25వ తేదీల్లో తొలుత కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారని టీడీపీ నేతలు వెల్లడించారు.
'వారాహి' ద్వారా బరిలోకి పవన్ కల్యాణ్..
మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఈ నెల 27వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ముందుగా ఉత్తరాంధ్ర నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. తొలి విడత ప్రచారంలో భాగంగా ముఖ్యమైన నియోజకవర్గాల్లో పవన్ ప్రచారం ఉండనుందని పార్టీ నేతలు తెలిపారు. ఇందుకోసం తన 'వారాహి' వాహనాన్ని సిద్ధం చేస్తున్నారు. అలాగే తాను పోటీ చేయనున్న పిఠాపురం నియోజకవర్గంలోనూ పర్యటించనున్నారు. జనసేనాని ప్రచారానికి సంబంధించి పూర్తి షెడ్యూల్ రూపొందిస్తున్నారు. ఇక వీరితో పాటు నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురుందేశ్వరి, ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల కూడా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయనున్నారు. మొత్తానికి కీలక నేతల ప్రచారంతో రాష్ట్రమంతా మైకులు, పాటలతో దద్దరిల్లనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com