అసెంబ్లీలో ‘వార్’ సీన్.. బాబుకు జగన్ సవాల్
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు మధ్యాహ్నం వాడీవేడిగా సాగాయి. ఇప్పటికే మూడుబిల్లులను ప్రవేశపెట్టిన జగన్ సర్కార్.. ఇవాళ మరికొన్ని బిల్లులను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఇంగ్లీష్ మీడియం బోధన’పై బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ క్రమంలో పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ-2019 బిల్లుపై గురువారం సభలో చర్చ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. అంతేకాదు.. టీడీపీ అధినేత చంద్రబాబు వర్సెస్ సీఎం జగన్‌గా పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అసెంబ్లీ ఇవాళ వార్ సీన్‌ను తలపించింది. అసెంబ్లీ వేదికగానే బాబుకు వైఎస్ జగన్ సవాల్ విసిరారు. మొదట ఈ ఇంగ్లీష్ మీడియంపై చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ఇంగ్లీష్ మీడియం అమలును వ్యతిరేకించిందన్నారు. అయితే బాబు వ్యాఖ్యలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
సవాల్ ఇదీ...!
‘ఇంగ్లీష్ మీడియం వద్దని నేను ఎప్పుడైనా చెప్పానా..?. నేను వద్దన్నట్లు దమ్ముంటే ఆధారాలు చూపండి..?. ఆంగ్ల మాధ్యమం వద్దని నేను ఎప్పుడైనా చెప్పానా? మీరు నిరూపించగలరా? అయిదేళ్ల అధికారంలో మీరేం చేశారు? అవకాశం ఉండి కూడా మీరు ఇంగ్లీష్ మీడియం అమలు చేయలేకపోయారు. 66 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం కొనసాగుతున్నా.. ఏ చర్యలు తీసుకోనందుకు సిగ్గుతో తలదించుకోవాలి. అయిదేళ్లు అధికారంలో ఉండి స్కూళ్లను మార్చే అవకాశం వస్తే చేయలేక ఇప్పుడు మేము చేస్తుంటే వక్రభాష్యాలు చెబుతారా..?. నారాయణ, చైతన్య స్కూళ్ల కోసం మొత్తం విద్యావ్యవస్థనే భ్రష్టు పట్టించిన చంద్రబాబుకు మాట్లాడే నైతిక హక్కు లేదు. ఇంగ్లీష్ మీడియం నేనే పెట్టాలని చూశానని చెప్పుకుంటున్న బాబు.. అయిదేళ్లు ఏం చేసినట్టు..?. పత్రికల్లో వచ్చిన ప్రతి కథనాలని మాకు అంటగట్టాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించం. టీడీపీకి పాంప్లెట్ పేపర్ ఈనాడులో రాసిన కథనాలు ఇక్కడ నేను ప్రదర్శిస్తే చంద్రబాబుకు ఎలా ఉంటుంది..?. మీడియా అనేది ఓ వ్యవస్థ. దాన్ని మాకు ఆపాదిస్తే ఎలా..? ఈనాడులో రాసిన వార్తలపై చర్చ జరిగితే చంద్రబాబు సభలో ఉండలేరు. భ్రష్టు పట్టించిన మీరు మాట్లాడుతున్నారంటే సిగ్గుతో తలదించుకోవాలి’ అంటూ బాబుపై వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మరోవైపు చంద్రబాబు కూడా అంతేరీతిలో బదులిచ్చారు.
చంద్రబాబు రియాక్షన్!
‘నేను సిగ్గుతో తలంచుకోవడం కాదు.. జగన్ సిగ్గుతో తలదించుకోవాలి. క్షమాపణ చెప్పాల్సిది.. ఆ వార్త రాసిన రాపించుకున్న మీరు.. సాక్షి పేపర్ మిమ్మల్ని మోసం చేసిందని ప్రజలకు క్షమాపణ చెప్పి, మోసం చేయలేదుచెప్పుకోవాలని చంద్రబాబు చెప్పారు. సాక్షిలో రాస్తే తనకు సంబంధం లేదనట్టుగా జగన్ మాట్లాడితే ఎలా..? ఈ మీ పేపర్‌కు విశ్వసనీయత లేదా....? మీ పేపర్ ఒక చెత్త పేపర్..’ అని బాబు రియాక్ట్ అయ్యారు.
బుద్ధి ఉందా.. వార్ సీన్!?
‘ఈ మనిషికి (చంద్రబాబు) ఏమన్నా బుద్ధి, జ్ఞానం ఉందా..?. కళ్లు పెద్దవి చేస్తే భయపడతామా..?. సాక్షి అనేది ఒక మీడియా వ్యవస్థ అని, ఎవరి అనుకూల ఛానల్స్, పేపర్స్ వాళ్లకుంటాయ్. వాటిలో రాసినవి తీసుకొచ్చి మాట్లాడితే ఎలా కుదురుతుంది..’ అని బాబుపై జగన్ కన్నెర్రజేశారు. ఇందుకు మళ్లీ బాబు స్పందిస్తూ.. నాకు బుద్ధి, జ్ఞానం లేదని సీఎం అన్నారని, సాక్షికి బుద్ధి, జ్ఞానం ఉందా..?. తప్పుడు డబ్బులతో మేం పేపర్లు, ఛానల్స్ పెట్టలేదు’ అని బాబు మరోసారి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ క్రమంలో అటు టీడీపీ సభ్యులు.. ఇటు వైసీపీ సభ్యులు ఒక్కసారిగా గట్టిగా అరిచారు. దీంతో అసెంబ్లీలో వార్ సీన్‌ను తలపించింది. ఇరువురికీ స్పీకర్ తమ్మినేని నచ్చజెప్పడంతో వారి ఆగ్రహావేశాలు చల్లారాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments