జగన్ కేబినెట్‌లో మంత్రులు 25మంది కాదు.. 100!
Send us your feedback to audioarticles@vaarta.com
ఇదేంటి.. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా 25 మంది ఇంకా ఎక్కువంటే మరో 5 కలిపి మొత్తం 30 వరకు మాత్రమే ఉంటాయ్.. కదా? 100 మంది ఎలా ఉంటారని ఆశ్చర్యపోతున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే.. అసలు ఈ కథా కహానీ ఏంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. వైఎస్ జగన్ తన కేబినెట్‌లోకి 100 మందిని ఒకేసారి కాకుండా.. ప్రస్తుతం 25 మందిని రెండున్నరేళ్ల తర్వాత మరికొందరు ముఖ్యనేతలకు అవకాశం కల్పిస్తానని తేల్చిచెప్పేశారు. దీంతో పార్టీలో మంత్రి పదవులు ఆశించిన నేతలు ఆనందంలో మునిగితేలుతున్నారు. సీనియర్లు, జూనియర్లు అనే తేడాలు లేకుండా అందర్నీ సమదృష్టితో జగన్ చూస్తున్నారు.
వీరికే చోటు...
ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎమ్మెల్యేలకే ఎక్కువ శాతం మంత్రి పదవులు ఇస్తామని వైసీపీ అధినేత ప్రకటించేశారు. అయితే డిప్యూటీ సీఎంలు మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు కేటాయించనున్నట్లు సీఎం పేర్కొన్నారు. ప్రస్తుతం 25మందిని మాత్రమే కేబినెట్‌లోకి తీసుకుని రెండున్నరేళ్ల తర్వాత 90శాతం మంత్రులను మారుస్తామని జగన్ సంచలన ప్రకటన చేసేశారు.
ఇలా మొత్తం 100 మందికి జగన్ కేబినెట్‌లో అవకాశం దక్కనుంది. అయితే మొదట 25 మందిలో ఎవరెవరికి అవకాశం దక్కుతుందో..? రెండున్నరేళ్ల తర్వాత ఎవరెవరికి చాన్స్ వస్తుంది..? అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సో.. మొదటి 25 మంది ఎవరన్నది తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే మరి.
రాజీనామా చేయాల్సిందే..!
అంతేకాదు.. మంత్రులుగా సరిగ్గా పనిచేయని వారు ఎప్పుడైనా సరే రాజీనామా సిద్ధంగా ఉండాలని.. ఇందులో ఎలాంటి మొహమాటాలు ఉండవని కూడా జగన్ ఇప్పటికే తేల్చిచెప్పేశారు. అయితే మంత్రి పదవి స్వీకరించిన నెల కావొచ్చు.. రెండు నెలలు కావొచ్చు.. రెండున్నరేళ్ల తర్వాత కావొచ్చు.. శాఖ సరిగ్గా న్యాయం చేయకపోతే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని వైసీపీఎల్పీ సమావేశంలో జగన్ గట్టిగా చెప్పేశారని తెలుస్తోంది.
వీటన్నింటికీ తాము సిద్ధంగా ఉన్నామని కాబోయే మంత్రులు జగన్‌కు చెప్పేశారట. ఇదిలా ఉంటే.. ఎక్కడా కాబోయే మంత్రుల వివరాలు బయటికి రానివ్వకుండా.. అధిష్టానం చాలా గోప్యంగా ఉంచింది. కాబోయే మంత్రులందరికీ వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి ఫోన్లు చేస్తారని జగన్ సీఎల్పీ భేటీలో చెప్పారు. ప్రస్తుతం విజయసాయిరెడ్డి కొత్త మంత్రులకు ఫోన్లు చేసే పనిలో బిజిబిజీగా ఉన్నారు.
కాగా.. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అన్నీ కీలక నిర్ణయాలు, సంచలన ప్రకటనలే చేస్తున్నారు. అయితే కేబినెట్ కూర్పు విషయంలో కూడా వెరైటీగా ఎవరూ ఊహించని రీతిలోనే జగన్ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. గతంలో ఏ ప్రభుత్వం చేయని పనులు.. కనివినీ ఎరుగని రీతిలో చేస్తూ అనుకున్నట్లుగానే ఆర్నెళ్లలోపే మంచి ముఖ్యమంత్రిగా అనిపించుకునే దిశగా జగన్ అడుగులేస్తున్నారని చెప్పుకోవచ్చు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments