జగన్ కేసుల విచారణ సోమవారానికి వాయిదా

ఏపీ ముఖ్యమంతి జగన్ మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఈ కేసు విచారణ సీబీఐ కోర్టులో శుక్రవారం జరిగింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఇతర నిందితులు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు అంగీకరించింది. కాగా.. జగన్‌కు సంబంధించిన కేసుల విచారణ ప్రతి శుక్రవారం జరిగేది. కానీ ఇటీవల ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులను సత్వరమే విచారించాలని సుప్రీంకోర్టు సూచించింది. దీంతో హైకోర్టు ఈ కేసుల విచారణను రోజువారీ చేపట్టాలని ఆదేశించింది. దీంతో కేసు విచారణను సీబీఐ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

కాగా.. కరోనా కారణంగా న్యాయవాదులు, నిందితులు అంతా కోర్టు హాలులో ఉండటం ఇబ్బందిగా మారుతుందని.. కాబట్టి విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించాలని జగన్ తరుఫు న్యాయవాదులు కోరారు. తాము విచారణకు సహకరిస్తామని.. కాబట్టి స్పష్టమైన ఉత్తర్వులివ్వాలని కోరారు. జగన్ కేసులో హైకోర్టులో స్టే ఉన్న కేసులను నవంబర్ 9కి వాయిదా వేస్తున్నట్టు సీబీఐ కోర్టు తెలిపింది. కాగా.. జగన్‌కు సంబంధించిన అన్ని కేసులపై విచారణను మాత్రం సోమవారానికి వాయిదా వేసింది.