జగన్-పవన్ కలిసి వార్ వన్‌సైడ్ చేయండి!
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో ఎన్నికలు హడావుడి మొదలైంది. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీ అస్త్ర శస్త్రాలకు పదునుపెడుతున్నాయి. ముఖ్యంగా అటు సోషల్ మీడియాలో వైసీపీ, జనసేన, టీడీపీ పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారాలు చేసుకుంటున్నాయి. మరోవైపు తీవ్ర స్థాయిలో ఒకరిపై ఒకరు విమర్శలు సైతం ఎక్కుపెడుతున్నారు. అయితే ఈ తరుణంలో విమర్శకులు కూడా తన కలానికి పదును పెడుతూ సోషల్ మీడియాలోకి దిగేశారు. సినీ క్రిటిక్ కత్తి మహేశ్ అందరికీ గుర్తుండే ఉంటాడు కదా..!? ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. బహుశా కత్తి చేసిన హంగామా, వివాదాలతో ఆయన పేరు మరిచిపోదామన్న మరవడానికి సాధ్యం కాదులెండి.. ఆయన చేసిన పనులు అలాంటివి మరి. ఎప్పుడూ మూడు వివాదాలు.. ఆరు కొట్లాటలుగా సాగే ఈయన సోషల్ మీడియాలో మరోసారి పవన్ విషయంలో కొత్త వివాదానికి తెరలేపాడు.
2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి కర్త, కర్మ, క్రియ జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనే విషయం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జగమెరిగిన సత్యమే. అవసరం అయిపోయిన తర్వాత టీడీపీ నేతలు పిల్లిమొగ్గలేస్తూ పవన్ వల్ల తాము గెలవట్లేదంటున్నార్లేండి కానీ గెలుపు మాత్రం పవన్‌తోనే సాధ్యమైంది. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో పవన్ బయటికి రావడం 2019 ఎన్నికల్లో ఒంటిరిగా బరిలోకి దిగాలనుకోవడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. మరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అప్పుడూ.. ఇప్పుడూ.. ఎప్పుడూ ఒంటిరిగానే పోటీచేస్తానని తేల్చేశారు. ఈసారి కచ్చితంగా అధికారం తనదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు మాత్రం రెండోసారి సీఎం కాబోతున్నానంటూ దేశంలో ఎక్కడా.. ఎప్పుడూ.. ఎవరూ కురిపించని వరాలు ఏపీ ప్రజలపై కురిపిస్తున్నారు.. ఇవి ఏ మాత్రం అధికారంలోకి తెచ్చిపెడ్తాయ్..? అనేది ఇక్కడ అప్రస్తుతం.
అయితే 2014 ఎన్నికల్లో చంద్రబాబు-పవన్ కలిశారు.. ఈ ఎన్నికల్లో జగన్-పవన్ కలవాలని చాలా మంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే జగన్.. పవన్ మాత్రం ఎవరిదారి వారిదే అన్నట్లుగా వెళ్తున్నారు. ఈ సందర్భంగా సినీ క్రిటిక్, విశ్లేషకుడు కత్తి మహేశ్ తన ఫేస్బుక్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశాడు.
కత్తి ట్వీట్ సారాంశం..
"నిజంగా పవన్ కళ్యాణ్ కి ముందుచూపు ఉంటే.. చరిత్రహీనుడిగా మిగలకూడదు అనుకుంటే,వైఎస్సార్సీపీ తో పొత్తు కుదుర్చుకుని వార్ వన్ సైడ్ చేసేయ్యాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అప్పుడు సమూలంగా మారే అవకాశం ఉంటుంది" అని కత్తి ఆకాంక్షించారు. అయితే కత్తి పోస్ట్‌పై అటు జగన్.. ఇటు పవన్ అభిమానులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. మేం కలిసే ప్రసక్తేలేదని వైసీపీ.. మేము అస్సలే కలవమని జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై వైసీపీ, జనసేన ముఖ్యంగా మెగా బ్రదర్ నాగబాబు నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout