హంగ్ వచ్చే అవకాశం ఉంది.. వైఎస్ జగన్
- IndiaGlitz, [Thursday,January 31 2019]
2019 ఎన్నికల్లో కేంద్రంలో హంగ్ వచ్చే అవకాశం ఉందని వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి జోస్యం చెప్పారు. గురువారం ‘అన్న పిలుపు’ కార్యక్రమంలో మాట్లాడిన జగన్.. పై వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జాతీయ సర్వేలు ఏపీలో ‘ఫ్యాన్’ గాలి వీస్తుందని తేల్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ ఈ మాటలు అన్నారు. అంతటితో ఆగని ఆయన పొత్తు విషయం తేల్చేశారు. గత కొన్ని రోజులుగా బీజేపీతో జగన్ కలవబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు, అధికార పార్టీ నుంచి విమర్శలు వస్తుండటంతో ఆయన స్పందించారు. ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు ఉండదని.. ఫలితాల తర్వాతే ఎవరితోనైనా పొత్తు అని జగన్ తేల్చేశారు.
కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదని సర్వేలు చెబుతున్నాయన్నారు. రాష్ట్రంలో 25కి 25 ఎంపీ సీట్లు మన పార్టీకి వస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, విభజన చట్టంలోని హామీలు అమలు చేయించుకోవచ్చని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. ఎవరో వచ్చి మాకు మాటలు చెబితే నమ్మి తాము పొత్తు పెట్టుకునే పరిస్థితులో లేమని.. ఒకవేళ అలా జరిగితే పార్టీకి నష్టమని జగన్ చెప్పుకొచ్చారు. కాగా.. పొత్తులపై జగన్ చేసిన కీలక వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.
నవరత్నాలు కాపీ కొడుతున్నారు..!
వైసీపీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘నవరత్నాలు’ను టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు కాపీ కొడుతున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా రెండు వేల పెన్షన్‌ను నవరత్నాల్లో 2017లోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా తమ నవరత్నాలను టీడీపీ కాపీ కొడుతోందని వైసీపీ.. తామేం మీ పథకాలను కాపీ కొట్టట్లేదని తెలుగు తమ్ముళ్లు గత కొద్దిరోజులుగా ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.
కాగా.. గురువారం సాయంత్రం రాష్ట్రానికి మంచి చేసే దిశగా తటస్థులు, మేధావులు, సమాజ సేవలో ఉన్న పలువురితో జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి నుంచి వైసీపీ అధినేత సూచనలు స్వీకరించారు. చట్టప్రకారం విశాఖపట్నానికి రైల్వే జోన్ రావాలని అలాగే.. దాదాపు అన్ని రాష్ట్రాలకూ రైల్వే జోన్ ఉంది కానీ మనకు లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఇందు కోసం వైసీపీ పోరాటం కొనసాగిస్తుందన్నారు. ఏపీలోని అన్ని జిల్లాల్లో ‘అన్నపిలుపు’లో భాగంగా తటస్థులను కలుస్తానని జగన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.