సింహంతో యువకుడు ఆటలు.. చివరికిలా..!
- IndiaGlitz, [Thursday,October 17 2019]
మృగరాజుతో చెలగాటాలొద్దని పెద్దలు చెబుతుంటారు.. చాలా వరకు జనాలు సింహాలు, పులులను ‘జూ’లో చూసి సైలెంట్‌గా వస్తుంటారు. అయితే ఓ యువకుడు మాత్రం సెన్సేషనల్ కావాలనుకున్నాడేమోగానీ చివరికి.. క్షణాల్లో హమ్మయ్యా.. అంటూ ప్రాణాలతో బయటపడ్డాడు. వివరాల్లోకెళితే.. బీహార్‌కు చెందిన యువకుడు రేహాన్ ఖాన్ జూకి వెళ్లాడు. అయితే జూకు వెళ్లి జంతువులు చూసి సైలెంట్‌గా రావాల్సిందిపోయి ఫెన్సింగ్‌పై నుంచి ఎన్‌క్లోజర్‌లోకి దూకి సింహం దగ్గరికెళ్లాడు.
కాసేపు ఆటాడుకున్నాడు చివరకీ..!
సింహం ముందు కూర్చుని విచిత్రంగా ప్రవర్తించాడు. అయితే సింహం అతనికి సమీపంగా వచ్చినప్పటికీ ఏమీ చేయలేదు. ఎలాంటి హానీ తలపెట్టకపోవడంతో మరింత రెచ్చిపోయాడు. అసలు తాను ఆటలాడుతున్నది మృగరాజుతో అన్న మాట మరిచిపోయాడో లేకుంటే ఇంకేమైనా అనుకున్నాడో తెలియదు కానీ కాసేపు హంగామా చేశాడు. అయితే సింహానికి చిర్రెత్తుకొచ్చింది.. ఒక్కసారిగా గాండ్రించడంతో అటుగా వెళ్తున్న జూ సిబ్బంది.. పోలీసులు విషయం తెలుసుకుని ఆ కుర్రాడినికి కాపాడారు.
పోలీసులు, జూ ప్రతినిధి ఏమన్నారంటే..!
ఈ సందర్భంగా ఓ సీనియర్ పోలీస్ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. ‘రేహాన్ మానసికంగా అస్థిరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అతన్ని ఎటువంటి గాయం లేకుండా వెంటనే పోలీసులు బయటకు తీసుకువచ్చారు’ అని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ‘మొదట కాపలాదారులు అతన్ని ఆపడానికి ప్రయత్నించినప్పటికీ, అతను ఆవరణ చుట్టూ ఉన్న హై మెటల్ గ్రిల్ పైకి ఎక్కగలిగాడు. మేమంతా అక్కడికి చేరుకున్నాము.. అతనికి ఒక నిచ్చెన ఇచ్చాము కానీ అతను వినలేదు. అప్పుడు మేము సింహాన్ని శాంతింపజేసి అతనిని రక్షించాము’ అని జూ ప్రతినిధి రియాజ్ అహ్మద్ ఖాన్ మీడియాకు వెల్లడించారు.