పాక్‌కు చుక్కలు చూపించిన భారత్ యంగ్ లేడీ!
- IndiaGlitz, [Wednesday,April 03 2019]
టైటిల్ చూడగానే ఇదేంటి మొన్నటి దాకా అభినందన్.. ఇప్పుడు ఈ యంగ్ లేడీ ఎవరబాబ్బా అని ఆశ్చర్యపోతున్నారా..? అవును ఆ యంగ్ ఆఫీసర్.. మహిళ అయినప్పటికీ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా దేశం కోసం ప్రాణాలకు తెగించి పోరాడి పాక్‌కు చెందిన విమానాలను తరిమి తరిమి కొట్టి చుక్కలు చూపించింది. పాక్ సైన్యం సైతం ఈమె దెబ్బకు బిత్తరపోయింది. ఈమె పేరు బయటికి రాలేదు గానీ యంగ్ లేడీ ఆఫీసర్ అని మాత్రం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఒకే ఒక్క యంగ్ లేడీ ఆఫీసర్...
ఫిబ్రవరి 26 తెల్లవారు జామున ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఉగ్రమూకల స్థావరమైన బాలకోట్‌పై సర్జికల్ దాడులు జరిపిన విషయం విదితమే. ఈ దాడుల్లో సుమారు 300మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఈ దాడులు చేసిన అనంతరం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారత్ వాయుసేన క్షేమంగా తిరిగొచ్చింది. అయితే ఇందుకు ప్రతీకారంగా పాక్ ఎక్కడ దాడులకు దిగుతుందో అని ప్రతీ కదలికను పంజాబ్‌లోని ఒక వాయుసేన స్థావరంలో పనిచేస్తున్న
యంగ్ లేడీ ఆఫీసర్ గమనిస్తూ వచ్చారు. ఫిబ్రవరి 27వ తేదీన ఉదయం సరిగ్గా 8: 45 సమయంలో పాక్ వైమానిక స్థావరాల్లో అనుమానాస్పద కదలికలను ఆమె గుర్తించడం జరిగింది. ఒకట్రెండు కాదు ఏకంగా వివిధ స్థావరాల నుంచి పాక్ వాయసేనకు చెందిన మొత్తం 25 విమానాలు కట్టకట్టుకొని గాల్లోకి లేచినట్లు గుర్తించిన ఆమె వెంటనే పీర్‌పంజాల్ వద్ద కాంబాట్ ఎయిర్ గస్తీలో ఉన్న రెండు మిరాజ్-2000, దానికి దక్షిణ భాగంలోని సుఖోయ్-30ఎంకేఐలకు, భారత పైలట్లకు చేరవేసింది.
అభినందన్ ఇలా దొరికారు..!
అయితే భారత్ ఇంత చేస్తున్నా పాక్ మాత్రం గుర్తించలేకపోయింది. హఠాత్తుగా మిగ్-21లు రంగంలోకి దిగడంతో కంగుతిన్న పాక్ విమానాలు పరుగులు తీశాయి. ఈ తరుణంలో పాక్‌కు చెందిన ఎఫ్-16, భారత్ మిగ్-21 కుప్పకూలిపోయాయి. కాగా మిగ్-21 కూలిపోతున్న టైమ్‌లో అక్కడ్నుంచి కిందికి దూకిన వింగ్ కమాండర్ అభినందన్ పాక్ దళాలకు చిక్కడం తెలిసిందే. ఆ తర్వాత ఆయన్ను చిత్ర వధకు గురిచేయడం ఆ తర్వాత విడుదల ఈ విషయాలన్నీ మనకు తెలిసినవే.
హెచ్చరికలు చేరి ఉంటే...
మిగ్-21 కూలక మునుపు అభినందన్ ఉన్న విమానాన్ని పాక్ వెంబడిస్తుండగా ఈ యువ అధికారిణి గమనించారు. అభినందన్ వారికి పట్టుబడకుండా ఉండాలని పలుమార్లు ‘ అభినందన్.. టర్న్ కోల్డ్, టర్న్ కోల్డ్..’ అని హెచ్చరించింది. అయితే అప్పటికే భారత రేడియో తరంగాలను బ్లాక్ చేయడంతో ఈ హెచ్చరికలు అభినందన్‌కు చేరలేదు. దీంతో అభినందన్‌కు పాక్ సైన్యం చేతిలో బంధీ అయ్యారు. ఒకవేళ అభినందన్‌కు ఆ హెచ్చరికలే చేరివుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి.
వాయుసేన పతకం...
ఒక వాయుసేన విభాగంలో మహిళ ఇంతటి ధైర్య సాహసాలు, అప్రమత్తత చూపడం విశేషమనే చెప్పుకోవచ్చు. అనుక్షణం భారత సరిహద్దులను కంటికి రెప్పలా కాపాడిన ఆమెను వాయుసేన అభినందించింది. అయితే భద్రతా కారణాల రీత్యా ఆమె పేరును మాత్రం వాయుసేన బయటపెట్టలేదు. అంతేకాదు ఆమె ధైర్య సాహసాలను మెచ్చిన ఉన్నతాధికారులు వాయుసేన సేవా పతకానికి నామినేట్ చేయడం జరిగింది. కాగా అధికారికంగా ఈ నామినేట్ విషయం మాత్రం బయటికి వెల్లడించలేదు. ఒక్క మాటలో ఆకాశంలో సగం ఆడది అంటారు.. ఇదిగో ఇలాంటి మహిళ రూపంలో ఆ మాట అక్షరాలా నిజమైందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అభినందన్ ఓ వైపు ఈ యంగ్ లేడీ ఆఫీసర్ మరోవైపు ఇద్దర్నీ యావత్ ప్రపంచం మరిచిపోదు.. చరిత్ర పుటల్లో వీరిరివురు మిగిలిపోతారని విశ్లేషకులు చెబుతున్నారు.