కరోనా భారిన పడ్డ విశ్వక్ సేన్: వ్యాక్సిన్ వేసుకున్నా, అప్రమత్తంగా వుండాలంటూ ట్వీట్

  • IndiaGlitz, [Friday,December 31 2021]

భారతదేశంలో మరోసారి కరోనా మహామ్మారి పంజా విసురుతోంది. నిన్న మొన్నటి వరకు అదుపులోనే వున్న కోవిడ్ కేసులు ఒక్కసారిగా పెరగడం ఆందోళనకు గురిచేస్తుంది. దీనికి తోడు దక్షిణాఫ్రికాలో పుట్టిన ఒమిక్రాన్ వేరియంట్ సైతం దేశంలో విస్తరిస్తోంది. ఇప్పటికే కేసుల సంఖ్య 1300కు చేరువైంది. రానున్న రోజుల్లో ఒమిక్రాన్ తీవ్రత ఊహాకు కూడా అందదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అయితే సినీ పరిశ్రమలో గడిచిన కొన్ని రోజులుగా కరోనా కలకలం సృష్టిస్తోంది. వరుసపెట్టి సినీ ప్రముఖులు కోవిడ్ బారినపడుతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఏ పరిశ్రమనూ వదలకుండా కరోనా వాయించేస్తోంది. కమల్ హాసన్, విక్రం, అర్జున్, వడివేలు, కరీనా కపూర్, నోరా ఫతేహి… మహేష్ బాబు వదిన శిల్పా శిరోద్కర్‌, మంచు మనోజ్‌లకు కోవిడ్ సోకిన సంగతి తెలిసిందే. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని విశ్వక్ సేన్ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

తనకు కరోనా పాజిటివ్ అని తేలిందని... ప్రస్తుతం వైద్యుల సూచనలతో క్యారంటైన్‏లో ఉండి చికిత్స తీసుకుంటున్నాని విశ్వక్‌ సేన్ తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకున్నా కరోనా వదలడం లేదని.. దయచేసి అందరూ మాస్కులు ధరించి అప్రమత్తంగా వుండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు విశ్వక్ సేన్. దీంతో సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా ద్వారా కోరుతున్నారు. ఇటీవల పాగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘‘ఓరి దేవుడా’’ సినిమా చేస్తున్నారు.