‘మళ్లీ చెప్తున్నా.. అగౌరపరిస్తే మట్టిలో కలిసిపోతారు’
- IndiaGlitz, [Thursday,November 14 2019]
‘మట్టిలో కలిసిపోతారు అనే మాట నేను ఆవేశంలో అనలేదు. తెలుగు భాషని మీరు అగౌరపరిస్తే మట్టిలో కలిసిపోతారు మళ్లీ చెప్తున్నా. భాషల్ని గౌరవించే సంప్రదాయం మా పార్టీది’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. జనసేన ప్రధాన అధికార ప్రతినిధులు మరియు అధికార ప్రతినిధులతో గురువారం నాడు పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ మంత్రులు, నేతలు తనపై మాట్లాడిన మాటలకు కౌంటర్ ఎటాక్ చేశారు.
ఇంగిత జ్ఞానం లేదు..!
‘ఏ కులంలో పుట్టాలి ఏ మతంలో పుట్టాలి మన ఎవరికీ ఛాయిస్ లేదు. కానీ ఎలా ప్రవర్తించాలో మన చేతిలోనే ఉంటాది. నా పేరులో లేనిది నాకు ఆపాదించడం ఆపండి. ఏమన్నా ఉంటే నేనే చెప్తాను. బొత్స గారు నిన్న తెగ బాధ పడిపోయారు తెలుగు భాష గురించి మట్టిలో కలిసిపోతారు అని అన్నాను అని. ఆయన్ని నేను అడుగుతున్నా విడిపోయిన వాళ్ల జీవితాలని తీసుకుని వస్తారు ఇంగిత జ్ఞానం లేదు ముందు మీ నాయకుడికి చెప్పండి ఎలా మాట్లాడాలో. ఇంగిత జ్ఞానం అంటే మీ భాషలో 'common sense'. అవినీతి పైన రాజీ లేని పోరాటం అంటే నవ్వుతారు నాకు తెలుసు. ఎప్పటికీ గెలవని పోరాటం అని తెలుసు. కానీ ప్రయత్నం చేయాలి. ఇసుక మీద గవర్నర్‌కి ఇచ్చిన 18 పాయింట్లలో ఒకటి ఎవరైతే స్మగ్లింగ్ చేస్తారో వారి పైన గూండా చట్టం, జైలు శిక్ష అని పెట్టాం నిన్న ప్రభుత్వం ఆమోదించింది అది’ అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
బాల్యం.. భగవంతుడు ఇచ్చిన వరం!
బాల్యం... భగవంతుడు మనకిచ్చిన వరం. మన జాతి భవిష్యత్తు సంపద బాలలే. వారి శ్రేయస్సుకి, మనో వికాసానికి, అభివృద్ధికి జనసేన పార్టీ కట్టుబడి ఉందని పవన్ పేర్కొన్నారు. మంగళగిరి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందు జవహర్ లాల్ నెహ్రూ చిత్ర పటానికి పవన్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయానికి తరలివచ్చిన చిన్నారులందరినీ ప్రేమతో పలుకరించి వారితో ముచ్చటించారు. సుమారు రెండు గంటల సేపు వారితో గడిపారు. వారు ప్రేమతో ఆయనకు ఇచ్చిన గులాబీలను స్వీకరించారు. కల్లా కపటం తెలియని వారి మాటలకు మురిసిపోయారు. కొందరిని గుండెలకు హత్తుకొన్నారు.. ఇంకొందరిని ఎత్తుకున్నారు. వాళ్లతో ఫోటోలు దిగారు.