Mallareddy: మల్కాజిగిరిలో నువ్వే గెలుస్తున్నావ్ అన్నా.. ఈటలతో మల్లారెడ్డి
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఏం చేసినా.. మాట్లాడినా.. సంచలనమే. తన వ్యవహారశైలితో నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. గతంలో పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డా.. సక్సెస్ అయినా.. అంటూ అసెంబ్లీలో మల్లారెడ్డి చేసిన ఓ ప్రసంగం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అదే విధంగా కొన్నిసార్లు అదిరిపోయే డైలాగులు విసురుతూ సభలో ఉన్నవాళ్లలో ఉత్సాహం నింపుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒక్కొక్కసారి నోరు జారుతూ హైలైల్ అవుతూ ఉంటారు.
తాజాగా బీఆర్ఎస్ పార్టీ లైన్ దాటి వ్యవహరించారు. ఈసారి మల్కాజ్‌గిరి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ విజయం సాధిస్తారంటూ బహిరంగంగా సంచలన ప్రకటన చేశారు. హైదరాబాద్ కొంపెల్లిలోని కేఎస్ఆర్ కన్వెన్షన్ హాలులో జరిగిన ఓ వేడుకకు ఈటల హాజరుకాగా.. అదే ఫంక్షన్‌కు మల్లారెడ్డి కూడా వెళ్లారు. ఇద్దరూ అప్యాయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భగా మల్లన్న అడిగి మరీ ఈటలతో ఫోటో దిగారు. అనంతరం ఎన్నికల గురించి మాట్లాడుకుంటూ ‘‘మల్కాజిగిరిలో ఇంకెవరు గెలుస్తారు. నువ్వే గెలుస్తున్నవ్’’ అంటూ ఈటల రాజేందర్‌ను గట్టిగా హత్తుకున్నారు. దీంతో అక్కడున్న వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఓవైపు పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక సీట్లు కోసం బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం స్వయంగా గులాబీ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగి రోడ్ షోల ద్వారా జనాల్లోకి వెళ్తున్నారు. ఈ తరుణంలో పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డి.. ఈటల రాజేందర్ గెలుస్తారని చెప్పడం పార్టీ వర్గాలను షాక్‌కు గురిచేసింది. మరోవైపు కాంగ్రెస్ నేతలేమో తాము చెబుతున్నట్లు బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని ఇప్పుడు బహిర్గతమైందని విమర్శిస్తున్నారు. దీంతో ప్రజల్లోకి బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనన్న భావన మరోసారి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
కాగా మేడ్చల్‌లో ఎమ్మెల్యేగా మల్లారెడ్డి ఉండగా.. మల్కాజిగిరిలో ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి.. కాంగ్రెస్ తరపును సునీతా మహేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలోని ఏడు నియోజకవర్గాల్లో ఆరు అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుస్తారని మల్లారెడ్డి చెప్పడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments