ప్రభుత్వ ఉద్యోగులకు యోగి ఝలక్

  • IndiaGlitz, [Friday,October 20 2017]

ప్రజా సమస్యలపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అధికారుల కార్యాలయాలకు వచ్చినప్పుడు అధికారులు తమ సీట్లలోంచి లేచి వారికి స్వాగతం పలకాలని, మరల తిరిగి వారు వెళ్లేటప్పుడు కూడా వారికి ఇలాంటి గౌరవమే వారికి ఇవ్వాలంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ ఉద్యోగులకు గట్టి షాక్ ఇచ్చారు.

తాజాగా ఈ ఆదేశాల్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసింది.

ప్రజా ప్రతినిధుల ప్రోటాకాల్ కింద ఉత్తరప్రదేశ్ చీఫ్ సెక్రటరీ రాజీవ్ కుమార్ ఈ ఆదేశాలిచ్చారు. ఈ ప్రోటోకాల్‌ను పాటించని అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

ఇకపై ప్రజా సమస్యలపై ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజాప్రతినిధుల పట్ల గౌరవంగా ఉండాలని, లేచి నిలబడి స్వాగతం పలకాలని స్పష్టం చేసింది. అంతే కాకుండా ఈ నిబంధనలను ఏమాత్రం అలక్ష్యం చేసినా సహించేది లేదని తాజాగా జారీ చేసిన ఆదేశాల్లో గట్టిగా హెచ్చరించింది.

ప్రభుత్వ అధికారులు తమను ఏమాత్రం లెక్క చేయడం లేదంటూ కొంత మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో యోగి సర్కార్ ఈ ఆదేశాలను జారీ చేసినట్లు తెలుస్తోంది.