ప్రసవం , లాక్‌డౌన్.. ఒంటరితనమే కృంగదీసిందా: యడ్డీ మనవరాలి ఆత్మహత్యపై దర్యాప్తు ముమ్మరం

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప మనవరాలు సౌందర్య మరణం ఆ రాష్ట్రాన్ని విషాదంలో ముంచెత్తింది. ముఖ్యంగా తన ముద్దుల మనవరాలు లేదని తెలిసి యడ్డీ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆయనను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ప్రధాని నరేంద్ర మోడీ , కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, మాజీ ప్రధాని దేవేగౌడలు యడియూరప్పను ఓదార్చారు. మరోవైపు సౌందర్య మరణానికి కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా ఒంటరితనం, మానసిక ఒత్తిడి వల్లే ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

మూడేళ్ల కిందట సౌందర్యకు డాక్టర్‌ నీరజ్‌కు ఘనంగా వివాహం జరిగింది. వారికి ఒకరే సంతానం. గర్భం దాల్చినప్పటికీ.. డెలీవరి ముందు వరకు ఆమె రామయ్య ఆసుపత్రిలో వైద్యురాలిగా సేవలు అందించారు. తొమ్మిది నెలల కిందటే బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత నుంచి ఇంటికే పరిమితమయ్యారు. సరిగ్గా అదే సమయంలో కరోనా మహమ్మారి విజృంభించడంతో ఇంట్లోనే ఎక్కువ సమయం ఒంటరిగా వుండటంతోనే సౌందర్య మానసిక ఒత్తిడికి గురై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

రాష్ట్రాన్ని శాసించే రాజకీయ కుటుంబానికి చెందినదైనా, యడియూరప్ప మనవరాలైనా ఒక సాధారణ అపార్ట్‌మెంట్‌లోనే సౌందర్య భర్తతో కలిసి నివసిస్తున్నారు. తన కుటుంబ నేపథ్యం గురించి కూడా ఎవరికి చెప్పుకునేవారు కాదట. అలా చెబితే అందరూ తనకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చి, దూరంగా ఉంచుతారని సౌందర్య భావించారు. కరోనా కారణంగా ఇంట్లో ఒంటరిగా ఉండటమే ఆమెను బాధించి ఉంటుందని అనుమానిస్తున్నారు. కుటుంబ కలహాలు కూడా ఏమీ లేవని సౌందర్య తల్లి పద్మావతి చెబుతున్నారు.