విశ్వాస పరీక్షలో సునాయాసంగా గెలిచిన యడియూరప్ప
- IndiaGlitz, [Monday,July 29 2019]
కన్నడనాట నెలకొన్న హైడ్రామాకు సోమవారంతో తెరపడిందని చెప్పుకోవచ్చు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కర్ణాటక అసెంబ్లీలో యడియూరప్ప సర్కార్ విశ్వాస పరీక్ష ఎదుర్కొంది. ఈ పరీక్షలో యడియూరప్ప సర్కార్ నెగ్గింది. మొత్తం 207 మంది సభ్యులున్న ఈ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 104 మంది సభ్యులు అవసరం. అయితే బీజేపీకి అనుకూలంగా 106 మంది.. బీజేపీకి వ్యతిరేకంగా 100 ఓట్లు వచ్చాయి. కాగా.. 105 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు, ఓ ఇండిపెండెంట్ కూడా మద్దతు పలకడంతో, మేజిక్ ఫిగర్‌ను యడ్డీ సర్కారు అధిగమించడంతో లైన్ క్లియర్ అయ్యింది.
జోస్యం ఫెయిల్.. సిద్దా అట్టర్ ప్లాప్!
ఇదిలా ఉంటే.. యడ్డీ ప్రభుత్వం మరోసారి కుప్పకూలుతుందని.. అనర్హత వేటు పడిన 17 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన నియోజకవర్గాల్లో కనీసం 8 స్థానాల్లో విజయం సాధించకుంటే, ఆ ప్రభుత్వం తిరిగి పడిపోతుందని విశ్లేషకులు అందరూ జోస్యం చెప్పారు. అయితే చివరికి అప్పే సునాయాసంగా గెలిచారు. కాగా.. విశ్వాస పరీక్ష మరికాసేపట్లో జరగనుందనగా.. మెజార్టీని నిరూపించుకునేందుకు బీజేపీకి 112 మంది ఎమ్మెల్యేల మద్దతు ఎక్కడుందని మాజీ సీఎం సిద్దరామయ్య నిలదీశారు. ఇది ప్రజా మద్దతుతో ఏర్పడుతున్న ప్రభుత్వం కాదని సిద్ధరామయ్య తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాగా రాజకీయ విశ్లేషకుల జోస్యం, సిద్దా వ్యాఖ్యలు అన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి.
విశ్వాస పరీక్ష మరుక్షణమే..!!
ఇవన్నీ ఒక ఎత్తయితే.. కర్నాటక విధాన సభ స్పీకర్ పదవికి రమేష్ కుమార్ రాజీనామా చేయడం జరిగింది. విశ్వాస పరీక్షలో బీజేపీ నెగ్గిన మరుక్షణమే రమేష్ ఈ నిర్ణయం తీసుకున్నారు. బలనిరూపణ, విశ్వాస పరీక్ష విషయంలో కాంగ్రెస్ తరఫున స్పీకర్‌గా ఉన్న రమేష్ కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అంతేకాదు.. ఈయన తీసుకున్న నిర్ణయాలతో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. కాగా.. 17 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన స్పీకర్‌గా రమేష్ సంచలనం సృష్టించిన విషయం విదితమే.