YS Sharmila:119 నియోజకవర్గాల్లో బరిలోకి వైసీటీపీ సిద్ధం.. వైఎస్ షర్మిల పోటీ ఎక్కడి నుంచి అంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై వైసీటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల క్లారిటీ ఇచ్చేశారు. రాష్ట్రంలోని 119 నియోజక వర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని ఆమె స్పష్టం చేశారు. రేపటి నుంచి ఆసక్తి గల అభ్యర్థులు బీఫాంల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో షర్మిల అధ్యక్షతన వైఎస్సార్టీపీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం మీడియాతో షర్మిల మాట్లాడుతూ తాను పాలేరు నుంచి పోటీ చేస్తానని తెలిపారు. రెండు నియోజక వర్గాల్లో తాను పోటీ చేయాలని డిమాండ్ కూడా ఉందన్నారు. అవసరమైతే విజయమ్మ, బ్రదర్ అనిల్ కూడా పోటీ చేస్తారని ఆమె పేర్కొన్నారు.
ఓట్లు చీల్చకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్‌తో చర్చలు జరిపాం..
అలాగే కాంగ్రెస్ పార్టీలో విలీనం అంశంపైనే ఆమె స్పందించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదని అనుకున్నామని వెల్లడించారు. ఓట్లు చీలితే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అందుకే ఓట్ల చీల్చారనే అపఖ్యాతి రాకూడదనే కాంగ్రెస్‌తో చర్చలు జరిపామన్నారు. నాలుగు నెలల పాటు ఎదురు చూశామని కానీ చర్చలు ఫలించలేదన్నారు. ఈ నేపథ్యంలోనే తాము ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. తెలంగాణలో మళ్లీ వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకువస్తామని షర్మిల చెప్పుకొచ్చారు.
షర్మిల రాకను వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి.. విలీనానికి బ్రేకులు..
రెండు సంవత్సరాల క్రితం వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించిన షర్మిల తెలంగాణ వ్యాప్తంగా 3,600 కిలో మీటర్లు పాదయాత్ర పూర్తి చేశారు. ఈ పాదయాత్రలో ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచారు. అయితే కేసీఆర్‌ను ఢీకొట్టాలంటే ఒంటరిగా పోరాడటం కన్నా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే ప్రయోజనమని భావించారు. ఈ నేపథ్యంలో వైఎస్ కుటుంబానికి సన్నిహితులు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో పలు దఫాలకు చర్చలు జరిపారు. ఢిల్లీ వెళ్లి నేరుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీతోనూ మంతనాలు చేశారు. అయితే షర్మిల రాకను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆమె పార్టీలో చేరితో లాభం కన్నా నష్టమే ఎక్కువనే నివేదికలు అందజేసింది. దీంతో షర్మిల ప్రతిపాదనలను కాంగ్రెస్ అధిష్టానం లైట్ తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆమె ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. కాగా నవంబరు 30న ఎన్నికలు జరగనుండగా.. డిసెంబరు 3న ఫలితాలు రానున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments