బద్వేల్‌లో వైసీపీ ఘన విజయం.. భారీ మెజార్టీ, కనుచూపు మేరలో కనిపించని విపక్షాలు
- IndiaGlitz, [Tuesday,November 02 2021]
అనుకున్నదే జరిగింది.. బద్వేల్ ఉపఎన్నికలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. తొలి రౌండ్ నుంచి స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్లిన ఆ పార్టీ అభ్యర్థి దాసరి సుధ భారీ మెజారిటీతో విజయాన్ని అందుకున్నారు. ఎనిమిది రౌండ్లు ముగిసేసరికి వైసీపీకి 84,682, బీజేపీకి 16,190, కాంగ్రెస్‌కు 5,026, నోటాకు 2,830 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ జోరుతో ఇతర పార్టీలేవి నిలబడలేకపోయాయి. ఇప్పటి వరకు లెక్కించిన ఓట్లలో వైసీపీకి.. పోలైన ఓట్లలో సగం కంటే ఎక్కువ రావడంతో ఉప పోరులో ఆ పార్టీ గెలిచినట్లైంది. అయితే అధికారికంగా వైసీపీ విజయాన్ని ఈసీ ప్రకటించాల్సి ఉంది.
కాగా.. బద్వేల్‌లో 60 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. అయితే ఇది 2019 ఎన్నికల్లో కంటే తక్కువ. మొత్తం 281 కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. బద్వేలులో 2,15,292 మంది ఓటర్లు ఉండగా.. 68.12 శాతం పోలింగ్ నమోదైంది. 2019లో ఇక్కడ 77.64 శాతం పోలింగ్ నమోదైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా వున్న డాక్టర్ వెంకట సుబ్బయ్య మరణించడంతో బద్వేల్‌లో ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో వైసీపీ సుబ్బయ్య సతీమణి సుధకి టికెట్ ఇచ్చింది. అయితే సంప్రదాయాన్ని గౌరవించి టీడీపీ, జనసేనలు తమ అభ్యర్ధులను నిలబెట్టలేదు. అయితే బీజేపీ పనతల సురేశ్‌ను, కాంగ్రెస్ కమలమ్మలను తమ అభ్యర్ధిగా ప్రకటించాయి.