YSRCP: ఏపీలో వైసీపీ సునామీ మరోసారి ఖాయం.. ప్రముఖ సర్వేలో వెల్లడి..

  • IndiaGlitz, [Thursday,February 29 2024]

అధికార పార్టీ ఒంటరిగా బరిలో దిగుతుంటే ప్రతిపక్షాలైన తెలుగుదేశం-జనసేనలు కూటమిగా సిద్ధమయ్యాయి. బీజేపీ కూటమిలో చేరుతుందా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈలోగా ఏపీలో అధికారం ఎవరికి దక్కుతుందనే విషయంలో ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు సర్వే నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే టైమ్స్ నౌ, ఇండియా టీవీ, పోల్ స్ట్రాటెజీ, పొలిటికల్ క్రిటిక్ సంస్థలు చేపట్టిన సర్వేల్లో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే అధికారం అని తేల్చి చెప్పాయి. తాజాగా జీన్యూస్ సంస్థతో పాటు మరో సంస్థ చేసిన సర్వేలోనూ వైసీపీదే అధికారం అని తేలింది.

జీ న్యూస్-మ్యాట్రిజ్ సంస్థ చేసిన సర్వే ప్రకారం.. రాష్ట్రంలోని మొత్తం 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 19 స్థానాల్లో విజయం సాధించనుంది. గత ఎన్నికల్లో 22 స్థానాలు దక్కగా.. ఈసారి మూడు స్థానాలు తగ్గుతాయని తెలిపింది. అలాగే తెలుగుదేశం-జనసేన కూటమికి ఆరు స్థానాలు దక్కుతాయని అంచనా వేసింది. ఇక కాంగ్రెస్-బీజేపీలకు ఒక్క సీటు కూడా దక్కదని పేర్కొంది.

ఈ ఫలితాలను అసెంబ్లీకు వర్తింపజేస్తే వైసీపీ 133 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకునే ఛాన్స్ ఉంది. ఈ సర్వేలో సంక్షేమం-అభివృద్ధి వైపు ప్రజలు మొగ్గుచూపినట్టుగా.. ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని వ్యాఖ్యానించింది. ఈసారి ఎన్నికల్లో వైసీపీకి 48 శాతం ఓట్ షేర్ రానుందని.. టీడీపీ-జనసేనకు 44 శాతం వస్తుందని అంచనా వేసింది. మొత్తానికి వైఎస్ జగన్ రెండోసారి అధికారంలో రావడం ఖాయమని స్పష్టం చేసింది.

అలాగే జనాధర్ ఇండియా సర్వేలోనూ వైసీపీకి అధికారం ఖాయమని తేలింది. ఈ సర్వేలో 175 అసెంబ్లీ సీట్లలో 125 సీట్లు వైసీపీకి వస్తాయని.. టీడీపీ-జనసేన కూటమికి 50 సీట్లు వస్తాయని తెలిపింది. ఇక జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ సున్నా స్థానాలకే పరిమితమవుతాయని పేర్కొంది. ఇక 25 లోక్‌సభ స్థానాల్లో అధికార వైసీపీకి 17 సీట్లు.. టీడీపీ కూటమికి 8 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. ఓటు శాతం పరంగా చూస్తే వైసీపీకి 49.2శాతం.. కూటమికి 46.3శాతం ఓట్లు రావొచ్చని చెప్పింది. మొత్తంగా ప్రస్తుతం వస్తున్న ఏ సర్వే చూసినా వైసీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో వైసీపీ శ్రేణులు ఫుల్ జోష్‌లో ఉండగా.. తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు డీలా పడిపోయారు