సీబీఐ రంగంలోకి దిగితే వైసీపీ, టీడీపీ నేతల పరిస్థితేంటి!?
- IndiaGlitz, [Friday,December 27 2019]
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ వర్సెస్ టీడీపీ అధినేత చంద్రబాబుగా పరిస్థితులు మారనున్నాయా..?. మంత్రుల సవాల్‌కు చంద్రబాబు ప్రతి సవాల్ వెనుక ఆంతర్యమేంటి..? అస్సలు తగ్గేదే లేదని చంద్రబాబు ఏ మాత్రం భయపడకుండా ముందుకెళ్తున్నారా..? అమరావతిలో తాను, తన పార్టీకి చెందిన నేతలు కొన్న భూములు వ్యవహారం అసలుకే ఎసరు తెచ్చిపెడుతుందా..? ఈ క్రమంలో జగన్ ప్రభుత్వం సీబీఐ కంటే ఆయన కూడా ఏ మాత్రం తగ్గకుండా బీ రెడీ.. మీరు రెడీ నా అంటూ సవాల్ విసరడం వెనుక ఆంతర్యమేంటి..? అసలు ప్రభుత్వం ఏమన్నది..? చంద్రబాబు ఏమంటున్నారు..? అనే ఆసక్తికర విషయాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
ప్రభుత్వం ఏమంటోంది!?
నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని ప్రకటించక మునుపే ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని.. 2014 డిసెంబర్-31కి ముందు కొన్న భూములపై న్యాయ నిపుణుల సలహా మేరకు సీబీఐ లేదా సీబీసీఐడీ లేదా లోకాయుక్తతో విచారణ జరిపిస్తామని మీడియా వేదికగా మంత్రి పేర్ని నాని ప్రకటించారు. అంతేకాదు.. టీడీపీ ప్రభుత్వం హయంలో జరిగిన అవినీతిపై ఇవాళ మంత్రి బుగ్గన ఆధ్వర్యంలోని సబ్ కమిటీ.. సీఎం వైఎస్ జగన్‌కు ఓ నివేదిక కూడా ఇచ్చింది. రాజధాని భూముల వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశిస్తామని.. నైతిక విలువలను దిగజార్చేలా గత ప్రభుత్వం వ్యవహరించిందని మంత్రి చెప్పుకొచ్చారు. భారీస్థాయిలో భూములు ఎవరెవరు కొన్నారో విచారణలో తేలుస్తామని.. రాజధాని ప్రకటనకు ముందే డ్రైవర్లు, ఇంట్లో పనివాళ్ల పేరుతో భారీగా భూములు కొన్నారని మంత్రి సంచలన ఆరోపణలు చేశారు. వాళ్లు కోరుకున్నట్టుగానే సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని తేల్చిచెప్పారు.
చంద్రబాబు ఏమంటున్నారు..!?
మంత్రి చేసిన ఇన్సైడ్ ట్రేడింగ్ వ్యాఖ్యలకు చంద్రబాబు స్పందించారు. ‘అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని అనుమానం ఉంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపిద్దాం ఇందుకు నేను సిద్ధంగానే ఉన్నాను. అదే సమయంలో ఏడు నెలలుగా విశాఖలో వైసీపీ నేతలు చేస్తున్న భూ అక్రమాలపై కూడా సీబీఐ విచారణకు ప్రభుత్వం సిద్ధమేనా..?. అమరావతిని చంపేస్తే డబ్బులు రావు. డబ్బులు సంపాదించే మార్గం తెలుసుకోవాలి. అమరావతిలో ఏడు నెలల్లో ఒక్క యూనిట్ కాంక్రీట్ కూడా కొత్తగా వేయలేదు. రివర్స్ టెండరింగ్ పేరుతో కేవలం చంకలు గుద్దుకుంటున్నారు. అంతా తాత్కాలికం అంటున్న సీఎం, మంత్రులు ఈ ఏడు నెలలు శ్మశానంలో కూర్చున్నారా?’ అని ప్రభుత్వానికి సవాల్ చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు.
ఎవరి పరిస్థితేంటో!?
మొత్తానికి చూస్తే ప్రభుత్వం.. టీడీపీపై సీబీఐ విచారణ జరిపిస్తామని అనడం.. చంద్రబాబు మాత్రం విశాఖలో ఇన్సైడ్ ట్రేడింగ్‌పై విచారణకు సిద్ధమా..? అని సవాల్ విసరడంతో ఏపీలో మరోసారి రాజకీయాలు వేడెక్కాయి. దీంతో ఇరువురు ఒకరిపై ఒకరు సీబీఐకి ఫిర్యాదులు చేసుకుంటే పరిస్థితేంటి..? ప్రభుత్వం తరఫున ఎవరైనా నిజంగా విశాఖలో ఇదివరకే భూములు కొనుంటే పరిస్థితేంటి..?.. ఇప్పటికే రాజధానిలో టీడీపీ అధినేత మొదలుకుని నాటి మంత్రులు, చోటా నాయకుల వరకు వారు కొన్న భూముల జాబితాను.. ల్యాండ్ మార్క్‌లతో సహా.. మంత్రి బుగ్గన అసెంబ్లీ వేదికగా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేశారు.. మరి టీడీపీ నేతల పరిస్థితేంటి..? ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోయంది. మరి ఫైనల్‌గా ఏం జరుగుతుందో..? సీబీఐ విచారణకు నిజంగానే వెళ్తే ఏం తేలుతుందో తెలియాలంటే జనవరి వరకు వేచి చూడాల్సిందే.