YCP:వైసీపీకి భారీ షాక్.. టీడీపీలోకి సిట్టింగ్ ఎమ్మెల్యేలు..?

  • IndiaGlitz, [Monday,December 25 2023]

ఎన్నికల వేళ వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని ఆ పార్టీ అధినేత జగన్ నిర్ణయించడంతో చాలా మంది శాసనసభ్యులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. తాజాగా కాకినాడ జిల్లాలో ఈ ప్రకపంనలు జోరందుకున్నట్లు తెలుస్తోంది. జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం ఎమ్మెల్యేలకు టికెట్ లేదని చెప్పడంతో వారు పక్క చూపులు చూస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోయినా సరే ఆ పార్టీలో చేరేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వచ్చే నెల 5 లేదా 6న పసుపు కండువా కప్పుకునేందుకు రెడీ అయినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

అలాగే పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా జనసేన పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన కొన్నిరోజులుగా హైదరాబాద్‌లో ఉంటూ జనసేన పెద్దలతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. అటు ప్రత్తిపాడు వైసీపీ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ సైతం ఇతర పార్టీల వైపు చూస్తున్నారట. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కాకినాడ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కూడా రాజీనామా బాటలో నడవనున్నారనే వార్తలు జోరందుకున్నాయి. దీంతో వైసీపీలో ఒక్కసారి భారీ కుదుపు ఏర్పడినట్లైంది. ఎప్పుడు ఏ ఎమ్మెల్మే పార్టీకి గుడ్‌బై చెబుతారా అనే సందేహం నెలకొంది.

రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఉభయగోదావరి జిల్లాల సీట్లు చాలా ముఖ్యం. గత ఎన్నికల్లో వైసీపీకి ఈ జిల్లాల నుంచి భారీ మెజార్టీ దక్కింది. ఈసారి మాత్రం ఆ జిల్లాల్లో వైసీపీకి చెక్ పెట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే జనసేనతో పొత్తు పెట్టుకోవడం.. ఆ పార్టీకి అక్కడ ఎక్కువ సీట్లు కేటాయించాలని చూస్తున్నారు. వీరి ఎత్తులకు జగన్ కూడా సిద్ధమయ్యారు. అందుకే గెలిచే అభ్యర్థులను బరిలో దింపాలని డిసైడ్ అయ్యారట. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని నిర్ణయించడంతో ఆ పార్టీని సందిగ్ధంలోకి నెడుతున్నట్లు ఉంది. సీటు లేదని చెప్పిన వారందరూ వేరే పార్టీల్లోకి జంప్ అవ్వాలని భావిస్తున్నారట. వీరితో పాటు దాదాపు 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ, జనసేనతో టచ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. ఇదే కనక నిజమైతే జగన్ వేసిన సీట్ల మార్పు ప్లాన్ బూమ్‌రాంగ్ అయినట్లేనని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.