Siddham: సీమలో వైసీపీ పొలికేక.. రాష్ట్ర చరిత్రలోనే భారీ బహిరంగ సభకు 'సిద్ధం'..
Send us your feedback to audioarticles@vaarta.com
'సిద్ధం' సభలతో ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం జగన్.. వైసీపీ క్యాడర్లో ఫుల్ జోష్ నింపారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలోని భీమిలి, కోస్తాంధ్రలోని దెందులూరుల్లో నిర్వహించిన సిద్ధం సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఊహించిన దాని కంటే ఎక్కువ సంఖ్యలో అభిమానులు పోటెత్తారు. దీంతో వైసీపీ పెద్దల్లో ఎక్కడ లేని ఉత్సాహం నెలకొంది. ఆ ఉత్సాహంతోనే రాయలసీమలోని రాప్తాడులో సిద్ధం సభకు సిద్ధమయ్యారు. వైసీపీ కంచుకోట అయిన సీమలో గత రెండు సభల కంటే ఎక్కువగా ఈ సభను విజయవంతం చేయాలని పూనుకున్నారు.
సీమ జిల్లాల్లో క్లీన్ స్వీప్ దిశగా..
గత ఎన్నికల్లో సీమ జిల్లాల్లోని 52 నియోజకవర్గాల్లో 49 స్థానాలు గెలవడంతో ఈసారి క్లీన్ స్వీప్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారు. అందుకు తగ్గట్లు ఈ సభను భారీగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాటు చేశారు. రాష్ట్ర చరిత్రలోనే ఇప్పటివరకు ఏ పార్టీ నిర్వహించన విధంగా ఈ సిద్ధం సభను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సువిశాల విస్తీర్ణంలో ఏర్పాటుచేసిన ఈ సభకు ఉమ్మడి వైఎస్సార్, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుంచి లక్షల సంఖ్యలో పార్టీ కేడర్, అభిమానులు, ప్రజలు తరలిరానున్నారు.
ఫ్యాన్ ఆకారంలో వాక్ వే..
రేపు(ఆదివారం) మధ్యాహ్నం సీఎం జగన్ ప్రత్యేక విమానంలో రాప్తాడు చేరుకుంటారు. అనంతరం కార్యకర్తలకు అభివాదం చేసి తన ప్రసంగం ప్రారంభిస్తారు. గత సభల మాదిరిగానే ప్రసంగానికి ముందు కార్యకర్తలను అభివాదం చేస్తూ నడిచేందుకు వేదిక ముందు పార్టీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ ఆకారంలో భారీ వాక్ వే ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడే బహిరంగ సభా వేదికతో పాటు పదుల సంఖ్యలో గ్యాలరీలు నిర్మించారు. నియోజకవర్గాల వారీగా వచ్చే వారందరూ గ్యాలరీలకు చేరుకునేలా సూచిక బోర్డులు సిద్ధం చేస్తున్నారు. సభా ప్రాంగణానికి వెనుక భాగంలో హెలిప్యాడ్ కూడా రెడీ చేశారు. అలాగే 25కి పైగా పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటుచేశారు.
10 లక్షల మంది హాజరయ్యే అవకాశం..
అలాగే దెందులూరు సిద్ధం సభలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. సీఎం జగన్ నడుచుకుంటూ వెళ్లే ర్యాంప్, గ్యాలరీలకు మధ్య దూరాన్ని పెంచారు. దెందులూరు సభలో ముఖ్యమంత్రి ప్రజలకు అభివాదం చేసుకుంటూ వెళుతున్న సమయంలో ర్యాంప్ పైకి అభిమానులు, కార్యకర్తలు ఒక్కసారిగా దూసుకొచ్చారు. ఓ అభిమాని అయితే ఏకంగా అత్యూత్సాహంతో జగన్ను హగ్ చేసుకున్నాడు. దీంతో సెక్యూరిటీ కంగుతినింది. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బంది పట్టిష్టమైన చర్యలను తీసుకుంటుంది. ఇందులో భాగంగానే దాదాపు పది లక్షల మంది కార్యకర్తలు వచ్చే అవకాశం ఉండటంతో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. సీమలో నిర్వహించే భారీ బహిరంగ సభ పార్టీకి మంచి ఊపు తెస్తుందని నాయకులు అంచనా వేస్తున్నారు. ఈ సభతో ప్రతిపక్షాలు ఆశలు గల్లంతు కావడమేనని చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments