Raghuramakrishna Raju:వైసీపీకి ఎంపీ రఘురామకృష్ణరాజు రాజీనామా
- IndiaGlitz, [Saturday,February 24 2024]
వైసీపీకి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు(Raghurama krishna Raju) రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధినేత సీఎం జగన్‌కు పంపించారు. మీరు నన్ను ఎంపీగా అనర్హుడిని చేయాలని ఎంత ప్రయత్నించినా నరసాపురం ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రజాస్వామ్యం గౌరవించి నన్ను కాపాడింది. నరసాపురం ప్రజలు ఎన్నుకున్నం దుకు.. వారికి తాను ఎంతో దూరంగా ఉన్నప్పటికీ.. సేవల విషయంలో మాత్రం లోటు రాలేదు. మీరు ఆశించిన ఫలితం దక్కనందుకు నేను కూడా ఒకప్పుడు చింతించాను. అందరం ప్రజాతీర్పు కోరవలసిన అవసరం, సమయం రెండూ వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో తాను తన దారి చూసుకున్న నేపథ్యంలో పార్టీకి, క్రియాశీలక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు.
కాగా కాగా 2019 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ తరపున రఘురామకృష్ణరాజు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. జనసేన తరపున కొణిదెల నాగబాబు, టీడీపీ తరపున వేటుకూరి వెంకట శివరామరాజు బరిలో నిలిచారు. అయితే వైసీపీ అభ్యర్థిగా రఘురామ 31,909 ఓట్ల మెజారిటీతో విజయం దక్కించుకున్నారు. ఆయన ఎంపీగా విజయం సాధించడం.. వైసీపీ అధికారంలోకి వచ్చిన జగన్ ముఖ్యమంత్రి కావడం చకచకా జరిగిపోయాయి.
ఇంతవరకు బాగానే ఉన్నా స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులకు, ఆయనకు మధ్య విభేదాలు తలెత్తాయి. ఇలా ఏర్పడిన విభేదాలు తారాస్థాయికి చేరడంతో ఆయన పార్టీకి దూరమయ్యారు. ఈ క్రమంలోనే ఎంపీ అనుచరులపై స్థానిక ఎమ్మెల్యేలు.. పార్టీ నాయకులు కేసులు పెట్టడం.. ఆయన ఫ్లెక్సీలు పెట్టకుండా అడ్డుకోవడం వంటి పరిణామాలు జరగడంతో ఆయన పార్టీకి రెబల్‌గా మారిపోయారు. అప్పటి నుంచి ఢిల్లీలోనూ ఉంటూ ప్రభుత్వ వైఫల్యాలపై తన గళం బలంగా వినిపించారు.
ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు రఘురామపై కేసులు నమోదు చేయడం.. ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జైలులో తనపై లాఠీ ఛార్జి చేశారంటూ ఆయన కోర్టులో తెలపడం సంచనలంగా మారాయి. అనంతరం సుప్రీంకోర్టు జోక్యంతో హైదరాబాద్‌లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇలా మొత్తం తన ఐదేళ్ల పదవీ కాలంలో 4 ఏళ్ల పాటు రెబల్గానే ఉన్నారు. మొత్తానికి ఎన్నికలకు నెల రోజుల ముందు రఘురామకృష్ణరాజు వైసీపీ ప్రాథమకి సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి నుంచి నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.