ఏయ్ రెడ్డీస్.. నన్ను రెచ్చగొడితే.. గూబ పగిలిపోద్ది: రఘురామరాజు

తనను ఫోన్‌లో బెదిరిస్తున్న వారిపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇటీవల వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న ఆయన నేడు తన విమర్శలకు మరింత పదును పెట్టారు. తనను రాజీనామా చేయాలంటూ కొందరు బెదిరిస్తున్నారని.. ఈ సారి అలా అంటే గూబ పగిలిపోతుందని హెచ్చరించారు. జగన్ సొంత నియోజకర్తగం నుంచి.. ఆయన సొంత సామాజిక వర్గం వారు తనను బెదిరిస్తున్నారని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. తనను లేపేస్తామంటూ దూషిస్తున్నారని ఆయన వెల్లడించారు.

నిన్న వైఎస్ రెడ్డి.. నేడు రామిరెడ్డిల పేరుతో ఫోన్ చేసి ఏదో చేస్తామని బెదిరిస్తున్నారని.. వారంతా తమ ఇంటికి వస్తే... సీఆర్‌పీఎఫ్ వాళ్లు షూట్ చేస్తారన్నారు. ఏయ్ రెడ్డీస్.. ఏంట్రా మీరు చేసేందంటూ రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు. తాను ప్రజల మద్దతుతో గెలిచానని.. అబద్దాలాడి అధికారంలోకి వచ్చిన మీరే రాజీనామా చేయాలన్నారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే గూబ పగిలిపోద్దన్నారు. తన సొంత స్టామినాతో గెలిచానని.. జగన్ బొమ్మతోనే కాదన్నారు. తనకు ఫోన్ చేసిన వెధవలు.. జాగ్రత్తగా ఉండాలని.. అనవసరంగా రెచ్చగొట్టొద్దని రఘురామ కృష్ణంరాజు ఫైర్ అయ్యారు.

ఒక్క రాజధానినే ఆర్థిక ఇబ్బందుల కారణంగా కట్టలేమని చెప్పిన జగన్.. మూడు రాజధానులు ఎలా కడతారని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతే రాజధానిగా కొనసాగుతుందన్నారు. జగన్ నిర్వహిస్తామన్న రచ్చబండ ఊసే లేదని.. ప్రజాదర్బార్‌ను ఇప్పటికీ నిర్వహించలేదన్నారు. దీంతో జగన్‌పై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందన్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా తనను కించపరుస్తూ పోస్టింగులు పెడుతున్న రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ సాంకేతిక విభాగం ఉన్నతాధికారి గుర్రంపాటి దేవేందర్‌రెడ్డిపై ఈ రోజే లోకాయుక్తకు ఫిర్యాదు చేశానన్నారు.