పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లు పెంపు: ప్రధానికి వైసీపీ ఎంపీ లేఖ
- IndiaGlitz, [Sunday,October 20 2019]
పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లు పెంపు విషయమై ప్రధాని నరేంద్ర మోదీకి వైసీపీ ఎంపీ బాలశౌరి లేఖ రాశారు. లేఖలో ఏముందంటే... ‘భారతదేశంలో మధ్యతరగతి ప్రజలు, సీనియర్ సిటిజెన్లు, పించనుదారులు, విశ్రాంత అధికారులు ఆదాయ మార్గంగా పొదుపు ఖాతాలలో తమ కష్టార్జితాన్ని జమ చేస్తారు. తమ సొమ్ము బ్యాంకులలో భద్రంగా ఉంటుందన్న భరోసాతో, కొంత సొమ్ము వడ్డీరూపంలో ఆదాయంగా వస్తుందన్న ఆలోచన వారికుంటుంది. బయటి వ్యక్తులు, ప్రైవేటు బ్యాంకులను కాదని , ప్రభుత్వ బ్యాంకులలో సొమ్ము భద్రంగా ఉంటుందన్న భరోసాతో ప్రభుత్వ బ్యాంకులలో తమ సొమ్మును దాచుకుంటారు. ఆర్ధిక సంస్కరణలలో భాగంగా 2003లో రిజర్వు బ్యాంకు వారు డిపాజిట్ లపై వడ్డీ రేట్లను తగ్గించినప్పటికీ పొదుపు ఖాతాల జోలికి మాత్రం వెళ్ళలేదు. అప్పటికి పొదుపు ఖాతాలపై వడ్డీ రేటు 3.5 శాతం కనిష్టంగా ఉంది. ఆ రేటు చాల స్వల్పంగా ఉన్నందున దానిని తగ్గించే ప్రయత్నం రిజర్వు బ్యాంకు వారు చేయలేదు. రిజర్వు బ్యాంకు జరిపిన ఆర్ధిక సమీక్ష సమావేశంలోని సూచనల ఆధారంగా స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా పొదుపు ఖాతాలలో ఒక లక్ష రూపాలయ వరకు ఉన్న డిపాజిట్‌లపై ఉన్న వడ్డీ రేటును తగ్గించింది. 3.5 శాతం నుంచి 3.25 శాతం కు తెచ్చింది.దీనిని ఆసరాగా తీసుకొని మిగిలిన ప్రభుత్వ బ్యాంకులు కూడా తమ తమ పొదుపు ఖాతాల డిపాజిట్‌లపై వడ్డీ రెట్లు తగ్గించే ప్రయత్నం చేయవచ్చు’ అని బాలశౌరి సలహా ఇచ్చారు. తద్వారా బ్యాంకుల్లో సొమ్ము దాచుకునే ప్రజల యొక్క ఆదాయం ఈ వడ్డీ రెట్ల తగ్గింపు ఫలితంగా గణనీయం తగ్గే అవకాశం ఉందని లేఖలో రాసుకొచ్చారు.
నిజంగా ఆశ్చర్యకరం..!
‘డిపాజిట్లపై వడ్డీ రెట్ల తగ్గింపు వలన దీనిపై ఆధారపడి జీవిస్తున్న ఎంతోమంది పింఛనుదారుల జీవితాలు ఇబ్బదుల్లోకి నెట్టేయబడ్డారు. కేంద్ర ఆర్ధిక మంత్రి బీమా కవర్ చేసే ప్రస్తుతమున్న ఒక లక్ష రూపాయల మొత్తం కంటే ఎక్కువ పెంచుతామని చేసిన ప్రకటన ప్రజలలో ఎన్నో ఆశలను రేపింది. ప్రస్తుతమున్న బీమా పరిధిని లక్ష రూపాయల నుండి కనీసం పది లక్షల రూపాయలకు పెంచినప్పుడే ప్రస్తుతమున్న పరిస్టితులకు సరిపోతుంది. 26 సంవత్సరాల క్రితం 1993 తరువాత ఇప్పటివరకూ ఈ విషయమై ఆలోచన చేయక పోవడం నిజంగా ఆశ్చర్యకరం. 1993 లో లక్ష అంతకంటే తక్కువగా ఉన్న డిపాజిట్‌ల సంఖ్య 90 శాతం కాగా.. ప్రస్తుతం అది 62 శాతంకు పడిపోయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇదంతా కూడా కేవలం పొదుపు ఖాతాలపై వడ్డీ రెట్ల తగ్గింపు ప్రభావం. ప్రస్తుతమున్న పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను 3.5 శాతం నుండి 5 శాతం కు పెంచడమే కాకుండా , పొదుపు ఖాతా మొత్తం పరిమితి ని 3 లక్షల వరకు పెంచాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కావున బీమా కింద కవర్ చేసే మొత్తాన్ని లక్ష రూపాయలనుండి కనీసం పది లక్షల రూపాయల వరకు పెంచాల్సిన సమయం వచ్చింది’ అని బాలశౌరి లేఖలో నిశితంగా వివరించారు. అయితే ఈ లేఖపై పీఎంవో ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.