పవన్‌పై వైసీపీ ఎమ్మెల్యేల ఎటాక్.. 100 సెకన్లు కూడా!
- IndiaGlitz, [Saturday,September 14 2019]
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వంద రోజుల పాలనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ నివేదికను విడుదల చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ సంక్షేమ పథకాలు జనరంజకమే కానీ.. పాలన మాత్రం జన విరుద్ధంగా ఉందన్నారు. సుమారు 9 విషయాలను ప్రస్తావిస్తూ పెద్ద హడావుడి చేశారు. అయితే.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు, నివేదికపై వైసీపీ ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చి ఎదురుదాడికి దిగారు.
పవన్.. గోడమీద పిల్లి!
వైసీపీ పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య.. పవన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘పవన్ కళ్యాణ్ ఇంకా చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నారు. చంద్రబాబుకి రహస్య మిత్రుడిలా మాట్లాడుతున్నారు. గోడమీద పిల్లి వాటాన్ని పవన్ కళ్యాణ్ మానుకోవాలి. జగన్ 100 రోజుల్లో 19 చారిత్రాత్మకమైన బిల్లులు తెచ్చారు. వాటిపై జనసేనాని అధ్యయనం చేయాలి. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా.. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఇవేవీ పవన్ కళ్యాణ్‌కు కనపడలేదా?’ అని పవన్‌కు కిలారి రోశయ్య సూటి ప్రశ్న సంధించారు.
చంద్రబాబు తొత్తులా..!
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘చంద్రబాబు ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకుంటే, కనీసం అప్పుడు నోరెత్తని పవన్ ఇప్పుడు... జగన్ వంద రోజుల పాలన మీద విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది. చంద్రబాబు తొత్తులా మాట్లాడుతున్నారు’ అని విష్ణు చెప్పుకొచ్చారు.
గెలిచినా ఓడినా!
‘గెలిచినా, ఓడినా ఏడాదిలో 100 రోజులు గాజువాకలోనే ఉంటాను. పవన్ ఎన్నికల తర్వాత కనీసం 100 సెకన్లు కూడా నేను పోటీ చేసిన నియోజకవర్గానికి కేటాయించలేదు’ అని విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు అమర్ నాథ్ కూడా పవన్ కళ్యాణ్ మీద ఎదురుదాడి చేశారు.