Pinnelli:హైకోర్టులో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట.. అజ్ఞాతం వీడనున్నారా..?

  • IndiaGlitz, [Friday,May 24 2024]

పోలింగ్ ముగిసినా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ఘర్షణలు మాత్రం ఇంకా తగ్గడం లేదు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయ్ గేట్‌ పోలింగ్ కేంద్రంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి.. ఈవీఎంను ధ్వంసం చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పిన్నెల్లి.. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం పిన్నెల్లి రామక్రిష్ణా రెడ్డిపై జూన్ 5 వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఈసీని ఆదేశించింది.

అయితే అభ్యర్థి సాక్షులను ప్రభావితం చేయొద్దంటూ షరతు విధించింది. అలాగే పిన్నెల్లి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించింది. ఎన్నికల లెక్కింపు ముగిసిన తర్వాత జూన్ 5 ఉదయం 10 గంటల వరకూ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. మొత్తానికి అరెస్ట్ కాకుండా హైకోర్టు నుంచి ఉపశమనం లభించిన నేపథ్యంలో అజ్ఞాతంలో ఉన్న పిన్నెల్లి సోదరులు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈవీఎంల ధ్వంసం కేసు, కారంపూడి అల్లర్ల నేపథ్యంలో పిన్నెల్లి సోదరుల అరెస్టులు తప్పదనే ప్రచారం సాగింది. దీంతో వారు పోలీసులకు దొరక్కకుండా పరార్ అయిపోయారు. ఇదే సమయంలో విదేశాలకు పారిపోకుండా రామకృష్ణా రెడ్డిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాగా హైదరాబాద్‌లో ఉన్న పిన్నెల్లి.. పోలీసులు అరెస్ట్ చేస్తారనే కారణంతో అక్కడి నుంచి పారిపోయారు. అయితే తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ పరిధిలో ఉన్న ఓ ఫామ్ హౌస్‌లో ఉన్న రామకృష్ణా రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే పోలీసులు మాత్రం ఈ అరెస్ట్ వార్తలను ఖండించారు. మరోవైపు ఆయన విదేశాలకు పారిపోయేందుకు కొంతమంది ఐపీఎస్ అధికారులు సహకరించారని జోరుగా ప్రచారం జరిగింది.

ఈ క్రమంలోనే ఈ కేసులో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.. కీలక నివేదికను పంపించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎంకే మీనా ద్వారా సీఈసీకి ఈ నివేదికను అందజేశారు. ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు 4 స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేసి గాలింపు చేపడుతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా పిన్నెల్లిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు డీజీపీ అందులో వివరించారు. ఇదిలా ఉంటే ఈవీఎంల ధ్వంసం ఘటనకు సంబంధించి ఎన్నికల సంఘం సిబ్బందిపై చర్యలు చేపట్టింది. పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ సహా ఇతర సిబ్బందిని సస్పెండ్ చేసింది.