‘23 సీట్లు ఖాళీ అవుతాయ్.. టీడీపీ ఉంటుందో.. ఊడిపోతుందో’!

  • IndiaGlitz, [Monday,October 28 2019]

ఏపీ ప్రభుత్వం కృత్రిమ ఇసుక కొరత సృష్టిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ ఇద్దరూ కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని.. ఎంత ఎగిరిపడినా వీరి విష ప్రచారాన్ని ప్రజలెవరూ విశ్వసించరని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ వ్యాఖ్యానించారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత వరుణదేవుడు కరుణించి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు నిండు కుండలాగా.. వాగులు, వంకలు పొంగిపొర్లుతూ.. నదులు సముద్రాలను తలపిస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. సాగునీరు, తాగునీరు వచ్చాయని ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. నదులు, కాల్వలు నిండుకుండలను తలపిస్తుంటే ప్రభుత్వం కృతిమ ఇసుక కొరతను సృష్టిస్తుందని చంద్రబాబు, పవన్‌ మాట్లాడడం సిగ్గుచేటన్నారు.

టీడీపీ ఉంటుందో..? ఊడిపోతుందో..?
అపారమైన అనుభవం ఉందని మాట్లాడే చంద్రబాబు.. కృత్రిమ ఇసుక కొరత సృష్టించే అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చింది..? ఇసుక తీయలేని స్థితిలో ఉంటే దాన్ని కృత్రిమ ఇసుకను సృష్టిస్తే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందా..? కనీస జ్ఞానం కూడా లేకుండా పాడు ప్రతిపక్ష నేత చంద్రబాబు, రాజకీయ అజ్ఞాని పవన్‌లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సోమవారం నాడు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే జోగి రమేష్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రజలు టీడీపీకి 23 సీట్లు ఇచ్చారని.. ఆ 23 కూడా ఖాళీ అయిపోతున్నాయన్నారు. అసలు టీడీపీ ఉంటుందో..? ఊడిపోతుందో..? అనేది ప్రశ్నార్థకంగా మారిందని వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆ పాపం చంద్రబాబుది కాదా!
‘ఇసుకతో ఇబ్బందులు ఉన్నాయని అంగీకరిస్తున్నాం. వరదలు తగ్గిన వెంటనే సమస్య పరిష్కారం అవుతుంది. కార్మికుల పక్షాన నిలబడతామని చంద్రబాబు, పవన్‌ ఇప్పుడు సవతి తల్లి ప్రేమ చూపించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కార్మికులకు అన్ని విధాలుగా అండగా ఉంది. ఏ వర్గానికి ఏ ఆపద వచ్చినా జగన్‌ ఆదుకోవడానికి ముందుంటారు. గత ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు విచ్చలవిడిగా ఇసుకను దోపిడీ చేశారు. చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట వద్ద రోజూ వందల లారీలు ఇసుక తరలిస్తుంటే రోజైనా కట్టడి చేశాడా..? వేల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతుంటే ఏ రోజు అయినా మాట్లాడాడా..? నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ బాబు ఇసుక దోపిడీకి రూ.100 కోట్ల జరిమానా విధించింది. ఈ పాపం చంద్రబాబుది కాదా..? దీనిపై సమాధానం చెప్పాలి’ అని ఈ సందర్భంగా జోగి డిమాండ్ చేశారు.

పవన్ రాజకీయ అజ్ఞాని..!
‘ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి రెండు చోట్ల పోటీ చేసి ఒక్కచోట కూడా గెలవలేని పవన్‌ కల్యాణ్‌ కూడా మాట్లాడడం హాస్యాస్పదం. పవన్‌ కల్యాణ్‌ ఒక రాజకీయ అజ్ఞాని. ఊర్లు పట్టుకొని తిరగాల్సిందే.. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఎగిరిపడుతూ పచ్చమీడియా సహకారంతో ప్రభుత్వంపై విషప్రచారం చేసినా, చేయించినా ప్రజలు ఎవరూ వారిని విశ్వసించరు. చంద్రబాబు, పవన్‌ నైజం ప్రజలు గ్రహించారు. ప్రజలు టీడీపీకి 23 సీట్లు ఇచ్చారు. ఆ 23 కూడా ఖాళీ అయిపోతున్నాయి. టీడీపీ ఉంటుందా.. ఊడిపోతుందా.. అనేది ప్రశ్నార్థకం. కొంతమంది బీజేపీ, ఇంకొంతమంది వేరోక పార్టీకి వెళ్తున్నారు’ అని జోగి రమేష్ జోస్యం చెప్పారు.