YCP Manifesto:వైసీపీ మేనిఫెస్టో విడుదల.. అమ్మఒడి పెంపు..
- IndiaGlitz, [Saturday,April 27 2024]
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ మేనిఫెస్టోను విడుదలచేశారు. 'నవరత్నాలు' పేరుతో 2019లో ఇచ్చిన మేనిఫెస్టోను ఇప్పుడు 'నవరత్నాలు ప్లస్' పేరుతో ప్రకటించారు. అయితే పథకాల కింద ఇచ్చే నిధులను మాత్రం పెంచారు. తొమ్మిది ముఖ్యమైన హామీలతో.. కేవలం రెండు పేజీలతో మేనిఫెస్టోను రూపొందించినట్లు జగన్ తెలిపారు. అబద్దాలతో చంద్రబాబుతో పోటీపడలేనని.. చేయగిలిగేవి మాత్రమే తాను చెబుతానని స్పష్టంచేశారు.
మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు..
అమ్మ ఒడి పథకం కింద ఇస్తున్న రూ.15వేలను రూ.17వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.
వైఎస్సార్ చేయూత నాలుగు విడతల్లో రూ.75వేల నుంచి రూ.లక్షా 50 వేలకు పెంచుతున్నట్లు తెలిపారు
రెండు విడతల్లో పింఛన్లు రూ.3500 చెల్లిస్తామని ప్రకటించారు (2028 జనవరిలో రూ.250, 2029 జనవరిలో రూ.250 పెంపు)
వైఎస్సార్ కాపు నేస్తం నాలుగు దశల్లో రూ.60 వేల నుంచి రూ.లక్షా 20వేలకు పెంపు
వైఎస్సార్ సున్నా వడ్డీ కింది రూ.3 లక్షల వరకు రుణాలు ఇస్తామని ప్రకటించారు
వైఎస్సార్ ఈబీసీ నేస్తం నాలుగు విడతల్లో రూ.45వేల నుంచి రూ. లక్షా 5 వేలకు పెంపు
కళ్యాణ మస్తు, షాదీ తోఫా కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు
రైతు భరోసా కింద ఇచ్చే సొమ్ము రూ.13,500 నుంచి రూ.16వేలు పెంపు (కౌలు రైతులకు రైతు భరోసా కొనసాగింపు)
అర్హులై ఇళ్ల స్థలాలు లేనివాళ్లందరికీ ఇళ్లు.. ఇళ్ల పట్టాల కొనసాగింపు
అమ్మ ఒడి, విద్యాకానుక, మహిళలకు వైఎస్సార్ చేయూత తదితర పథకాల కొనసాగింపు
ఆటో, ట్యాక్సీ, లారీలు కొనుగోలు చేసేవారికి వడ్డీ రాయితీ ప్రకటించారు
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99శాతం నెరవేర్చామన్నారు. ఈ ఐదేళ్ల పాలనలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం ఆనందంగా ఉందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత తమకు దక్కుతుందన్నారు. మ్యానిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం, భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించామని అన్నారు. ఓ ప్రొగ్రెస్ కార్డు మాదిరి ఏంఏం చేశామన్నది ప్రజలకు వివరించామని జగన్ చెప్పారు. పాదయాత్రలో ఎన్నో కష్టాలు చూశానని.. చదివించాలని ఉన్నా.. చదివించలేని తల్లుల పరిస్థితిని కళ్లారా చూశానన్నారు. తాను చూసిన పరిస్థితులకు పరిష్కారం కోసం ఈ 58 నెలల పాలనతో పని చేశానని పేర్కొన్నారు. అర్హులను జల్లెడ పట్టి మరీ వెతికి సంక్షేమం అందించామని చెప్పారు.
కరోనా కాలంలోనూ మ్యానిఫెస్టో అమలు చేశామని అన్నారు. ఐదేళ్ల కాలంలో రూ.2లక్షల70కోట్లను డీబీటీ ద్వారా అందించామని తెలిపారు. సామాజిక న్యాయం అన్నదానికి అర్ధం చెబుతూ మాటల్లో కాదు చేతల్లో చూపించామన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటు.. మ్యానిఫెస్టోలో పొందుపర్చని హామీలను సైతం ఐదేళ్ల కాలంలో అమలు చేయడం జరిగిందని చెప్పకొచ్చారు. పిల్లలకు ట్యాబ్స్, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, పిల్లలకు విద్యాకానుక, రాజీవ్ ఆరోగ్యశ్రీ నిధులు పెంపు వంటి పథకాలు మ్యానిఫెస్టోలో లేవని.. అయినా అమలు చేశామని జగన్ వెల్లడించారు.
2014లో టీడీపీ కూటమికి ఓటు వేసినందుకు ప్రజల జీవితాలు అతలాకుతలమయ్యాయని విమర్శించారు. అప్పుడు చంద్రబాబు తెలిపిన రుణమాఫీ, పొదుపు సంఘాల రుణాలపై కూటమి ఇచ్చిన హామీలేమయ్యాయి? అని జగన్ ప్రశ్నించారు. సింగపూర్‌ను మించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతీ నగరంలోనూ హైటెక్ సిటీ కడతానంటూ అబద్ధాలు చెప్పారని,. కనీసం ప్రత్యేక హోదా అంశాన్నికూడా పట్టించుకోకుండా.. అదేమైనా సంజీవనా? అంటూ చంద్రబాబు గతంలో వెటకారంగా మాట్లాడాడంటూ జగన్ గుర్తు చేశారు. చనిపోయిన తరువాత ప్రతి పేదవాడి గుండెల్లో, ప్రతి ఇంట్లో తన ఫోటో ఉండాలి అనే తాపత్రయం లేనప్పుడు రాజకీయాలు ఎందుకు చేయాలని అభిప్రాయపడ్డారు.