వామ్మో ఎమ్మెల్సీ సీటా?.. భయపడిపోతున్న వైసీపీ నేతలు
- IndiaGlitz, [Thursday,July 02 2020]
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం మొదలైంది. నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయిన నేపథ్యంలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే వీటిలో రెండు వైసీపీ ఖాతాలోనే ఉండగా.. మరో రెండు కూడా వైసీపీకే దక్కే అవకాశం ఉంది. అయితే టికెట్ ఆశావహుల సంఖ్య మాత్రం పెద్దగా కనిపించడం లేదు. ఎమ్మెల్సీ సీటు అంటేనే నేతలు భయపడుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను తమ పార్టీలో చేర్చుకోవడంతో అదనంగా ఒక ఎమ్మెల్సీ స్థానం వైసీపీ ఖాతాలో వచ్చి చేరింది. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లు రాజ్యసభకు ఎన్నిక కావడంతో వారి ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. అలాగే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు అయిన తాటిపర్తి రత్నాబాయి.. కంతేటి సత్యనారాయణరాజుల పదవీకాలం ముగిసింది. ఈ రెండు స్థానాలూ వైసీపీ ఖాతాలోకే చేరనున్నాయి.
ఇప్పటికే తోట త్రిమూర్తులు, పండుల రవి పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానాలను తీసుకోవడానికి మాత్రం నేతలెవరూ.. సుముఖంగా లేరని తెలుస్తోంది. కారణం ఆ రెండు స్థానాల పదవీకాలం 9 నెలల్లో పూర్తి కావడమే. తొమ్మిది నెలల కోసం ఎమ్మెల్సీ పదవిని స్వీకరించడం అనవసరమని నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ పదవీకాలం ముగిసిన అనంతరం కూడా తమకే ఆ పదవులను కట్టబెట్టేలా అయితే కొంత వరకూ నేతలు సుమఖత వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తోంది.
ఎమ్మెల్సీ పదవులంటే వైసీపీ నేతలు జంకడానికి మరో కారణం.. శాసనమండలి రద్దు. శాసనమండలిని రద్దు చేయాలని సీఎం జగన్ నిర్ణయించి అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కేంద్రానికి పంపారు. పార్లమెంట్ ఆమోదిస్తే శాసనమండలి రద్దవుతుంది. అయితే ఈ ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందనేది తెలియదు. ఒకవేళ మండలి రద్దైతే అసలుకే ఎసరొచ్చే అవకాశం ఉంది. మొత్తమ్మీద బయటకు చెప్పకున్నా.. ఎమ్మెల్సీ పదవంటేనే వైసీపీ నేతలు భయపడిపోతున్నట్టు తెలుస్తోంది.