CM Jagan:ఎన్నికల యుద్ధానికి వైసీపీ 'సిద్ధం'.. క్యాడర్‌ను 'సంసిద్ధం' చేయనున్న జగన్..
Send us your feedback to audioarticles@vaarta.com
ఉత్తరాంధ్ర వేదికగా సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఫిబ్రవరిలో ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో 'సిద్ధం' పేరుతో ఎన్నికలకు క్యాడర్‌ను 'సంసిద్ధం' చేయనున్నారు. 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలకు దిశానిర్దేశం వహించనున్నారు. ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టేలా కార్యాచరణను రూపొందించనున్నారు. ఇవాళ విశాఖలోని భీమిలి నియోజకవర్గం సంగివలసలో జరిగే భారీ బహిరంగసభ ద్వారా సమరభేరి మోగించనున్నారు. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ఉన్న 34 నియోజకవర్గాల్లో 28 స్థానాలను వైసీపీ గెలుచుకుంది. ఈసారి మొత్తం స్థానాలను గెలిచేలా జగన్ వ్యూహాలు రచిస్తున్నారు.
పార్టీ క్రియాశీలక సభ్యులు, సానుభూతిపరులతో జరగబోయే ఈ సభకు ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల నుంచి 3లక్షల మందికి పైగా హాజరుకానున్నారు. దాదాపు గంటన్నర పాటు సీఎం జగన్ మాట మంతి కలుపనున్నారు. ర్యాంప్ ద్వారా నేరుగా వారితో కలిసి ముచ్చటించనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 5.30 గంటల వరకూ ఈ సమావేశం ఉండనుంది. ఓవైపు టీడీపీ-జనసేన పొత్తు సీట్లు సర్దుబాటులతో కాస్త కదుపులకు గురైన నేపథ్యంలో ఈరోజు జరగబోయే బహిరంగ సభపై రాష్ట్రం మొత్తం ఆసక్తి నెలకొంది.
రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో 'సిద్ధం' పేరుతో ఎన్నికల సభలు నిర్వహించనుంది. ముందుగా భీమిలిలో ఈ సభ నిర్వహిస్తోంది. అనంతరం ఈనెల 30 ఏలూరులో బహిరంగ సభ నిర్వహించనుంది. ఉమ్మడి గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి కార్యకర్తలు ఈ సభకు తరలిరానున్నారు. ఈ బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి ప్రసంగించడమే కాకుండా కార్యకర్తలు, నేతలతో సమావేశం కానున్నారు. ఓవైపు అభ్యర్థులను ఖరారు చేస్తున్న వైసీపీ అధినేత ఇప్పుడు ఎన్నికల ప్రచారంలోకి దిగారు. ఎన్నికల సమయంలో పార్టీ అధినేతే స్వయంగా ప్రచారంలోకి దిగడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
ముఖ్యమంత్రి అయిన దగ్గరి నుంచి ప్రభుత్వ కార్యక్రమాల్లో మాత్రమే జగన్ పాల్గొనేవారు. ఇప్పటివరకు పార్టీ అధినేతగా ఎలాంటి బహిరంగ సభల్లో పాల్గొనలేదు. ఇంతర భారీ స్థాయిలో కార్యకర్తలను కూడా నేరుగా కలుసుకోలేదు. దీంతో ఈ సభ ద్వారా జగన్ ఏం మాట్లాడనున్నారనే దానిపై అందరి దృష్టి నెలకొంది. ప్రతిపక్షాల విమర్శలపై కౌంటర్ ఎటాక్ చేస్తారా..? ముఖ్యంగా ఆయన సోదరి వైయస్ షర్మిల జగన్‌పై చేస్తున్న విమర్శలపై స్పందిస్తారా..? కొత్తగా ఏమైనా పథకాలు ప్రకటిస్తారా..? అనే చర్చ జోరుగా నడుస్తోంది.
ఇప్పటికే గడపగడపకు మన ప్రభుత్వం, వై ఏపీ నీడ్స్ జగన్, మా నమ్మకం నువ్వే జగన్ వంటి కార్యక్రమాలతో ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. అలాగే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చామని చెప్పుకొచ్చారు. సామాజిక న్యాయం చేస్తూ అన్ని వర్గాలకు న్యాయం చేశామని పేర్కొంటున్నారు. అంతేకాకుండా వాలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు చేసి నేరుగా లబ్ధిదారుల వద్దకే పథకాలు పంపిణీ చేస్తున్నామని వివరిస్తున్నారు. వైద్య, ఆరోగ్య, పాలనా రంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్గాలను తీసుకొచ్చామని జగన్ పదే పదే చెబుతూ వస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో మళ్లీ తనను ఆశీర్వదించాలని ఈ సభ ద్వారా కోరనున్నారు. మొత్తానికి ఎన్నికల కురుక్షేత్రంలోకి దిగిన జగన్.. కార్యకర్తలను యుద్ధానికి 'సిద్ధం' చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments