Bigg Boss Telugu 7 : ఫుడ్ పొగొట్టుకున్న యావర్ .. అమర్ సీక్రెట్ చెప్పిన అర్జున్, చెంప పగులగొట్టిన శివాజీ
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ తెలుగు 7 మరో రెండ్రోజుల్లో ముగియనుంది. ప్రస్తుతం హౌస్‌లో నామినేషన్స్, గొడవలు లాంటివేవి లేవు. కంటెస్టెంట్స్ ఈ 15 వారాల్లో ఏమేం చేశారనే దానిపై బిగ్‌బాస్ ఫోటోలు, వీడియోలు ప్రదర్శించి వారిని సర్‌ప్రైజ్ చేశాడు. ఉల్టా పల్టా పేరుతో పాత టాస్క్‌లు ఆడిస్తూ హౌస్‌మేట్స్‌కు వారి కుటుంబ సభ్యులు పంపిన ఫుడ్‌ను అందిస్తున్నాడు. కంటెస్టెంట్స్ అంతా ఎవరి ఇంటి ఫుడ్ కోసం వారు టాస్కులు ఆడటం కాదు.. మరొకరు టాస్క్ ఆడి గెలిస్తేనే వారికి తమ ఇంటి ఫుడ్ దక్కుతుందన్నది బిగ్‌బాస్ కండీషన్. ఇప్పటికే అర్జున్, అమర్‌దీప్, శివాజీలు తమ ఇంటి ఫుడ్‌ను సొంతం చేసుకున్నారు. కానీ ప్రియాంక, ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్‌లకు మాత్రం రాలేదు.
ఇక శుక్రవారం ప్రారంభమైన ఎపిసోడ్ చాలా ఫన్నీగా సాగింది. ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ ఫన్నీ టాస్క్‌లు ఇచ్చాడు. దీనిలో భాగంగా అమర్‌దీప్ ని జ్యోతిష్యుడిగా మార్చేసి.. ఇంటి సభ్యుల జాతకం చెప్పాల్సిందిగా టాస్క్ ఇచ్చాడు. ఇందుకోసం అమర్‌దీప్ జ్యోతిష్యుడి గెటప్ వేయడంతో పాటు భాషను కూడా మార్చాడు. ముందుగా పల్లవి ప్రశాంత్‌ని పిలిచి దండం పెట్టుకుని కూర్చోమన్నాడు. అతని చేతిని భూతద్దం పెట్టి పరిశీలించి నీ చేయి చాలా పెద్దదన్నాడు. పొలం దగ్గర నీకు ఒక తాబేలు దొరికింది, దాని వల్లే నీకు బాగా కలిసొచ్చింది అని ప్రశాంత్‌కి చెప్పాడు. తర్వాత ప్రిన్స్ యావర్ జాతకం చెప్పించుకోవడానికి వచ్చాడు. బిత్తిరి బిత్తిరిగా హౌస్ మొత్తం తిరిగావు.. బెడ్‌రూమ్‌లో పడుకోవద్దు అన్న పాపానికి ఓ పెద్దావిడను బయటికి పంపించావు అంటూ షకీలా ఎలిమినేట్ అయిన విషయాన్ని గుర్తుచేశాడు అమర్. నువ్వు ఇంప్రెస్ అయిన ప్రతీ మనిషి ఎక్స్‌ప్రెస్ చేయని విధంగా బయటికి వెళ్లిపోయారని చెప్పాడు.
అనంతరం అర్జున్ అంబటి జాతకం చెప్పించుకోవడానికి వచ్చాడు. అసలు అమర్‌దీప్ ఏం చెప్పకముందే జాగ్రత్తగా చూసి చెప్పండి స్వామి అని దండం పెట్టాడు. అయితే అమర్‌కు అర్జున్ రివర్స్‌లో జాతకం చెప్పాడు. అనగనగా ఓ కారు.. కారులో పార, పార కింద చీర అని చెప్పడం మొదలెట్టాడు . దీంతో ఇంకెం చెప్పొద్దని అర్జున్‌ను వేడుకున్నాడు అమర్. శివాజీ కూడా అమర్‌దీప్ జాతకం చెప్పడం మొదలుపెట్టాడు. దూకుడుతో వెళ్తున్నారని, మధ్యలో తనతో ఎన్ని విభేదాలు వచ్చినా ఇప్పుడు బాగా క్లోజ్ అయ్యావంటూ శివాజీ చెప్పాడు. అలా ఈ గేమ్ చాలా ఫన్నీగా సాగింది. శివాజీ, అర్జున్‌లు అమర్‌తో వున్న చనువుతో సరదాగా మాట్లాడారు. కొన్నిసార్లు అమర్ సహకరించకపోవడంతో శివాజీ అయితే అతని చెంప పగులగొట్టి మరీ తనను కూర్చోమన్నాడు.
తర్వాత అమర్‌దీప్, అర్జున్, శివాజీలు.. ఫుడ్ లభించని వారిలో ఒకరికి తమ ఇంటి సభ్యులు పంపిన ఆహారాన్ని బహుమతిగా ఇవ్వాల్సి వుంటుందని, అలాగే వారి కోసం మరోసారి ఆడాల్సిన సమయం వచ్చేసింది అంటూ కంటెస్టెంట్స్‌కు వివరించాడు. దీనిలో భాగంగా అమర్ తొలుత టాస్క్ గెలిచి ప్రిన్స్ యావర్‌కు ఫుడ్ అందించాల్సిందిగా కోరాడు. దీనికి బిగ్‌బాస్ ఓ కండీషన్ పెట్టాడు. తను కేవలం ఒక్క ఇంటి సభ్యుడితో మాత్రమే ఫుడ్ షేర్ చేసుకోవాలని చెప్పగా.. దానికి యావర్ ఒప్పుకోలేదు. అందరికీ భోజనం కావాల్సిందేనని మొండిపట్టు పట్టడంతో బిగ్‌బాస్ అలా కుదరదని తేల్చి చెప్పేశాడు.
ఫినాలే అస్త్ర సమయంలో అర్జున్, అమర్, ప్రశాంత్‌లు ఆడిన బాల్స్ టాస్క్‌ను.. ఇప్పుడు అమర్, అర్జున్, శివాజీలు ఆడటం మొదలెట్టగా. శివాజీకి ఆ పజిల్ ఏంటో అర్ధం కాక .. ఇదేదో పత్తి యాపారం మాదిరిగా వుందన్నాడు. అయితే అర్జున్‌కి ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ వుండటంతో టాస్క్ పూర్తి చేసి గంట కొట్టాడు. పల్లవి ప్రశాంత్‌కు ఫుడ్ ఇవ్వాలని అర్జున్ కోరగా.. సేమ్‌కు యావర్‌కి పెట్టినట్లే అతనికి కూడా కండీషన్ పెట్టాడు బిగ్‌బాస్. దీంతో ప్రశాంత్ అమర్‌దీప్ పేరు చెప్పగా.. ఇద్దరూ కలిసి ఫుడ్‌ను ఆస్వాదించారు.
ఇకపోతే.. ప్రస్తుతం ఇంటిలో వున్న అందరి కంటే అమర్‌దీప్ దగ్గర ఎక్కువ పాయింట్స్ వుండటంతో అవి తనకు ఇచ్చేస్తే మీ ఫ్యామిలీలో ఒకరితో వీడియో కాల్ మాట్లాడే అవకాశం కల్పిస్తానని బిగ్‌బాస్ ఆఫర్ ఇచ్చాడు. దీనికి అమర్ అంగీకరించి తన భార్య తేజస్వినితో వీడియో కాల్ మాట్లాడే ఛాన్స్ పొందాడు. డిసెంబర్ 14న తమ వివాహ వార్షికోత్సవం కావడంతో ఒకరికొకరు విష్ చేసుకున్నారు. ధైర్యంగా వుండాలని అమర్‌ను ఉత్సాహపరిచింది తేజస్విని.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com