Yatra 2:నేను వైయస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డని.. 'యాత్ర 2' టీజర్ విడుదల..

  • IndiaGlitz, [Friday,January 05 2024]

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా 'యాత్ర' చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 ఎన్నికల ముందు ముందు విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆయన తనయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ జీవిత కథ ఆధారంగా ‘యాత్ర 2‘ పేరుతో సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. వైఎస్సార్ చనిపోయిన తర్వాత జరిగిన పరిణామాలు, జగన్ జైలు జీవితం, పాదయాత్రను ఇందులో చూపించబోతున్నట్లు సమాచారం.

ప్రతిపక్ష నేత నుంచి ముఖ్యమంత్రి ఎలా అయ్యారనేది ఈ సినిమా కథ అని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే విడుదలైన 'యాత్ర 2' టైటిల్‌, మోషన్ పోస్టర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ విడుదల చేశారు. 'యాత్ర'లో వైఎస్సార్ పాత్రలో సీనియర్ హీరో మమ్ముట్టి కనిపించగా.. ఈ సినిమాలో తమిళ నటుడు జీవా జగన్ పాత్రలో నటించారు. ఇక చంద్రబాబు పాత్రలో మహేష్ మంజ్రేకర్, సోనియాగాంధీ పాత్రలో సుజన్నే బెర్నార్ట్, వైఎస్ భారతి పాత్రలో కేతకి నారాయణ్‌తో పాటు పలువురు ప్రముఖులు యాక్ట్ చేశారు.

కాగా యాత్ర 2' చిత్రాన్ని త్రి ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇక ‘యాత్ర’ సినిమా ఫిబ్రవరి 8, 2019లో విడుద‌ల కాగా.. ‘యాత్ర 2’ ని కూడా అదే రోజు అంటే ఫిబ్రవరి 8, 2024న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఈ మూవీ కోసం వైసీపీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.