చంద్రబాబుకు శాపం తగిలింది.. అందుకే ఓటమి!
- IndiaGlitz, [Saturday,June 15 2019]
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఎవరూ ఊహించని రీతిలో వైసీపీ మెజార్టీ సీట్లు దక్కించుకోగా.. జనసేన తరఫున పోటీచేసిన వారిలో ‘ఒకే ఒక్కడు’ గెలిచారు. అయితే అసలు ఎక్కడ లోపం జరిగింది..? ఎందుకు ఓడిపోయాం..? అని కారణాలు వెతికినప్పటికీ తెలియట్లేదని చంద్రబాబే స్వయానా చెప్పారు. రానున్న ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తామని.. ఇందుకు ఇప్పట్నుంచే కార్యాచరణ ప్రారంభించాలని నేతలకు చంద్రబాబు వర్క్‌షాప్‌లో వివరిస్తున్నారు.
బాబుకు శాపం..!
ఇదిలా ఉంటే.. టీడీపీ ఓటమిపై అటు వైసీపీ నేతలు.. ఇటు కొందరు రాజకీయ ప్రముఖులు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. తాజాగా.. ప్రముఖ భాషావేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఈ వ్యవహారంపై మాట్లాడుతూ.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ఓటమికి తెలుగుతల్లి శాపం కూడా ఓ కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగు భాష అభివృద్ధి కోసం ఇచ్చిన ఏ హామీనీ చంద్రబాబు నిలబెట్టుకోలేదన్నారు. ప్రతీ స్కూలులో తెలుగును తప్పనిసరి చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఓ వైపు చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు.. మరోవైపు వైఎస్ జగన్‌ను యార్లగడ్డ అభినందించారు.
జగన్ కృషిని అభినందిస్తున్నా!
తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమీ విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా యార్లగడ్డ.. ముఖ్యమంత్రిని కోరారు. తెలుగు భాషాభివృద్ధి కోసం జగన్ చేస్తున్న కృషిని అభినందిస్తున్నామని పేర్కొన్నారు. శనివారం నాడు విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న యార్లగడ్డ పై వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.