విలేఖరికి షాకిచ్చిన యమీ గౌతమ్

  • IndiaGlitz, [Wednesday,November 13 2019]

హీరో నితిన్ హీరోగా న‌టించిన చిత్రాల్లో గౌత‌మ్ మీన‌న్ 'కొరియ‌ర్‌బాయ్ క‌ల్యాణ్‌' చిత్రాన్ని తెర‌కెక్కించారు. బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌత‌మ్ ఈ చిత్రంలో నితిన్ జోడిగా న‌టించింది. అయితే ఈమెకు ద‌క్షిణాది కంటే ఉత్త‌రాది సినిమాల్లోనే అవ‌కాశాలు ఎక్కువ‌గా వ‌చ్చాయి. విజ‌యాలు కూడా ద‌క్క‌డంతో ఈమెకు హిందీలో ఓ గుర్తింపు ద‌క్కింది. రీసెంట్‌గా ఈమె న‌టించిన బాలీవుడ్ చిత్రం 'బాలా'. ఈ సినిమా గురించి యామీ గౌత‌మ్ ఓ ఆంగ్ల ప‌త్రిక‌తో మాట్లాడుతున్న స‌మ‌యంలో విలేఖ‌రి మీరు బ‌ట్ట‌త‌ల ఉన్న వ్య‌క్తిని పెళ్లి చేసుకుంటారా? అని ప్ర‌శ్నించారు. దానికి ఆమె 'ఎందుకు చేసుకోకూడ‌దు?' అంటూ ఇచ్చిన బ‌దులు అంద‌రికీ న‌చ్చింది.

''సాధార‌ణంగా బ‌ట్ట‌త‌ల ఉన్న వ్య‌క్తులు కూల్‌గా ఉంటారు. అస‌లు 'బాలా' సినిమాను తెర‌కెక్కించ‌డానికి కార‌ణం ఓ మెసేజ్ ఇవ్వ‌డానికే. డైరెక్ట‌ర్ కౌశిక్ ఓ మంచి సినిమాను తెర‌కెక్కిస్తున్నార‌ని మేం న‌మ్మాం. బ‌ట్ట‌త‌ల ఉన్న వ్యక్తులు ముందు త‌మ‌ని తాము ప్రేమించుకోవాలి. త‌ర్వాతే ఇత‌రుల నుండి ప్రేమ ద‌క్కుతుంద‌ని ఆశించాలి. ప్ర‌స్తుతం సినిమాపై మేం పెట్టుకున్న న‌మ్మ‌కం నిజ‌మైంది. సినిమాకు మంచి ఆద‌ర‌ణ ద‌క్కుతుంది. ఈ చిత్రంలో న‌టించ‌డం మంచి ఎక్స్‌పీరియెన్స్‌, డిఫ‌రెంట్ పాత్ర‌లో న‌టించాను'' అన్నారు. ఆయుష్మాన్ ఖురానా హీరోగా అమ‌ర్ కౌశిక్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన 'బాలా' చిత్రం రీసెంట్‌గా విడుద‌లై పెద్ద విజ‌యాన్ని సాధించింది. సినిమా విడుద‌లైన నాలుగు రోజుల్లో 52.20 కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల‌ను సాధించిందని ట్రేడ్ వ‌ర్గాల అంచ‌నా.