దక్షిణాఫ్రికాలో మరో డేంజరస్ వైరస్: కరోనా కొత్త రూపం 'నియోకోవ్'.. సోకితే ప్రతి ముగ్గురిలో ఒకరు మృతి
- IndiaGlitz, [Friday,January 28 2022]
2019 చివరిలో చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించని ఓ సూక్ష్మజీవి తనకంటే ఎన్నో రెట్లు శక్తివంతుడైన మనిషిని నాలుగు గోడలకు పరిమితం చేసింది. తనలో తాను ఉత్పరివర్తనం చెందుతూ మానవాళికి కొత్త సవాల్ విసురుతోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ ప్రస్తుతం ప్రపంచాన్ని చుట్టేస్తోంది. అనేక దేశాల్లో దీని కారణంగా లక్షలాది కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా యూరప్ ఖండం దీని ధాటికి చివురుటాకులా వణుకుతోంది. దీని నుంచి కోలుకోకముందే.. మరో వైరస్ పుట్టినట్లు రష్యా న్యూస్ ఏజెన్సీ ఒకటి కథనాలను ప్రచురించింది.
కరోనా వైరస్ కొత్తగా రూపాంతరం నియోకోవ్‌గా బయటకొచ్చిందన్నది వాటి సారాంశం. ఈ కొత్త వైరస్ నియోకోవ్ వ్యాప్తి కూడా అధికంగా ఉంటుందని వుహాన్ శాస్త్రవేత్తలు పేర్కొన్నట్లు తెలిపింది. మరణాల సంఖ్య కూడా అధికంగా నమోదు అయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. వైరస్ సోకిన వారిలో ప్రతి ముగ్గురిలో ఒకరు మృతి చెందే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది.
అయితే నియోకోవ్ వైరస్ అనేది పాతదే అంటున్నారు శాస్త్రవేత్తలు.. మెర్స్-కోవ్ కుటుంబానికి చెందినదే అని స్పష్టం చేశారు. నియోకోవ్ వైరస్‌ను మొదటిసారిగా దక్షిణాఫ్రికాలో గబ్బిలాల్లోనే గుర్తించారు. అయితే గబ్బిలాల జనాభాలోనే ఈ వైరస్ వ్యాప్తి చెందుతోందని భావించినప్పటికీ, కానీ, తాజా పరిశోధనలో మాత్రం నియోకోవ్‌తో పాటు దాని దగ్గరి అనుబంధ వైరస్ పీడీఎఫ్-2180-కోవ్ మనుషులకూ సోకుతుందని తేలింది. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలను bioRxiv అనే వెబ్ సైట్‌లో ప్రచురించారు. ఈ వార్తల నేపథ్యంలో మరోసారి ప్రపంచం ఉలిక్కిపడింది.