SS RajaMouli : అందుకే మహేశ్‌ను సెలక్ట్ చేసుకున్నాడు.. కథేంటంటే : విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్

ఆర్ఆర్ఆర్ బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఏ సినిమా తీయబోతున్నాడంటూ టాలీవుడ్‌తో పాటు మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమ ఉత్కంఠగా ఎదురుచూసిన సంగతి తెలిసిందే. తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతాన్ని తెరకెక్కించే పనిలో జక్కన్న వున్నడంటూ సోషల్ మీడియా కోడై కూసింది. కానీ వీటన్నింటికీ చెక్ పెడుతూ సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో పనిచేయబోతున్నట్లు రాజమౌళి అనౌన్స్ చేశాడు. అంతే దీని గురించి రోజుకోక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మహేశ్ ఫ్యాన్స్ అయితే పండుగ చేసుకుంటున్నారు.

ఫుల్ లెంగ్త్ యాక్షన్, అడ్వెంచర్‌ ట్రై చేస్తున్న రాజమౌళి:

అయితే మహేశ్‌తో రాజమౌళి ఎలాంటి జోనర్‌ను తెరకెక్కించనున్నారు. ఫాంటసీనా, ఫిక్షనా, అంటూ జోరుగా చర్చ జరుగుతోంది. దీనికి జక్కన్న తండ్రి , ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. ఇదో యాక్షన్, అడ్వెంచర్ మూవీ అని.. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సినిమా సాగుతుందని తెలిపారు. తాజాగా ఆయన మరోసారి మహేశ్ - రాజమౌళి ప్రాజెక్ట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మహేశ్‌కు కథ రాయాలన్నది చాలా మంది రచయితల కల:

మహేశ్ బాబు లాంటి నటుడికి కథ రాయాలన్నది చాలా మంది రచయితల కల అన్నారు. ఆయనొక ఇంటెన్సిటీ వున్న నటుడని, మహేశ్ గత చిత్రాల్లోని యాక్షన్ సీక్వెన్స్‌లు చూస్తే ఇంటెన్సిటీ కనిపిస్తుందన్నారు. చాలా రోజులుగా ఓ యాక్షన్ అడ్వెంచర్‌ను తెరకెక్కించాలని భావిస్తోన్న రాజమౌళి.. తను అనుకున్న కథకు మహేశ్ అయితే సరిగ్గా సెట్ అవుతాడని అతనిని హీరోగా ఎంపిక చేసుకున్నాడని విజయేంద్రప్రసాద్ తెలిపారు. మహేశ్ ఇమేజ్, బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగానే తాను కథను రాశానని, ప్రపంచవ్యాప్తంగా వున్న పలు ప్రదేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుతామని... 2023 జూన్ నాటికి చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశం వుందని ఆయన పేర్కొన్నారు.

డిప్రెషన్ నుంచి బయటపడుతోన్న మహేశ్ :

ఇక సినిమాల విషయానికి వస్తే.. సర్కార్ వారి పాటతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న మహేశ్ బాబు.. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవల తన కుటుంబంలో వరుస విషాదాల నేపథ్యంలో ఇంటికే పరిమితమైన సూపర్‌స్టార్.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. పనిచేస్తూ, నలుగురితో వుంటేనే మహేశ్ తిరిగి మామూలు మనిషి అవుతాడని కుటుంబ సభ్యులు చెబుతూ వుండటంతో షూటింగ్‌లో పాల్గొనాలని ఆయన కూడా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం బ్యాక్ టూ వర్క్ అంటూ మహేశ్ బాబు ట్వీట్ చేసి ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్ చెప్పారు.