నా క‌ల నెర‌వేర‌డం మాటల్లో చెప్ప‌లేనంత సంతోషంగా ఉంది - రైట‌ర్ సాయిమాధ‌వ్

  • IndiaGlitz, [Tuesday,January 03 2017]

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టించిన 100వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. ఈ చిత్రాన్ని జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కించారు. ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై రూపొందిన ఈ చిత్రంలో బాల‌య్య స‌ర‌స‌న శ్రియ న‌టించారు. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రం సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సంద‌ర్భంగా మాట‌ల ర‌చ‌యిత సాయిమాధ‌వ్ బుర్రాతో ఇంట‌ర్ వ్యూ మీకోసం...!

ఈ సినిమా ప్రారంభించ‌క ముందు గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి గురించి మీకు ఎంత వ‌ర‌కు తెలుసు..?

శాత‌క‌ర్ణి గొప్ప‌వాడు, అమ‌రావ‌తి రాజ‌ధానిగా ప‌రిపాలించాడు అని మాత్ర‌మే తెలుసు. క్రిష్ క‌థ చెప్పిన త‌ర్వాత స్ట‌డీ చేసాను. కృష్ణం వందే జ‌గ‌ద్గురుమ్ త‌ర్వాత ఈ సినిమా చేయాలి అనుకున్నాం. ఆత‌ర్వాత ఈ క‌థ తొంద‌ర‌గా పూర్త‌వ‌దు. దీనికి చాలా రీసెర్చ్ చేయాలి అనుకుని కంచె సినిమా చేసాం. ఆత‌ర్వాత హిందీలో గ‌బ్బ‌ర్ చేసారు. ఫైన‌ల్ గా ఎప్ప‌టి నుంచో అనుకున్న‌ది ఇప్ప‌టికి కుదిరింది.

ఈ సినిమాకి మీరు రీసెర్చ్ ఎలా చేసారు. స‌మాచారాన్ని ఎలా సేక‌రించారు..?

శాత‌క‌ర్ణి గురించి క్రిష్ చ‌దివిన పుస్త‌కాన్ని నాకు పంపించేవారు. నాకు ఏదైనా పుస్త‌కం ల‌భిస్తే క్రిష్ కు ఇచ్చేవాడిని. అలాగే తెనాలిలోని ఫ్రెండ్స్ కొంత మంది శాత‌క‌ర్ణి గురించి స‌మాచారాన్ని సేక‌రించి పంపించారు.

చ‌రిత్ర‌లో ఎలా జ‌రిగిందో అలాగే చూపించారా..? మార్పులు ఏమైనా చేసారా..?

చ‌రిత్ర‌లో ఎలా ఉందో అలాగే తీసాం. ఎక్క‌డా మార్పులు చేయ‌లేదు. బేసిక్ స్టోరీని మార్చ‌లేదు.

ఈ క‌థకు హీరో బాలకృష్ణ అని ముందుగా అనుకున్నారా..? లేక వేరే హీరోతో అనుకున్నారా..?

క్రిష్ గారు క‌థ చెప్పిన త‌ర్వాత ఈ క‌థ‌కు బాల‌కృష్ణ గారు అయితే బాగుంటుంది అని నేను అంటే...నేను ఆల్రెడీ మాట్లాడాను. బాల‌కృష్ణ గారే చేస్తున్నారు అని చెప్పారు. బాల‌కృష్ణ గారికి క‌థ చెప్ప‌గానే వెంట‌నే ఓకే అన్నారు. క‌థ చెబుతున్న‌ప్పుడే ఆయ‌న ఆ పాత్ర‌లోకి వెళ్లిపోయారు.

బాల‌కృష్ణ 100వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి, చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెం 150 ఈ రెండు చిత్రాల‌కు మీరు డైలాగ్స్ రాసారు క‌దా..! ఎలా ఫీల‌వుతున్నారు..?

చిన్న‌ప్ప‌టి నుంచి చిరంజీవి గారు, బాల‌కృష్ణ గారు సినిమాలు చూస్తూ పెరిగాను. వాళ్ల సినిమాల‌కు వ‌ర్క్ చేయాలి అనేది నా క‌ల‌. నా క‌ల నెర‌వేర‌డం సంతోషంగా ఉంది. అది కూడా వాళ్ల కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచే చిత్రాల‌కు వ‌ర్క్ చేయ‌డం మాట‌ల్లో చెప్ప‌లేనంత ఆనందాన్ని క‌లిగిస్తుంది.

దేశం మీసం మేలేద్దాం...డైలాగ్ బాగా పాపుల‌ర్ అయ్యింది. డైలాగ్స్ కి వ‌స్తున్న రెస్పాన్స్ ఎలా ఉంది..?

డైలాగ్స్ కి చాలా మంచి స్పంద‌న ల‌భిస్తుంది. ఇంత స్పంద‌న వ‌స్తుంది అని అస‌లు ఊహించ‌లేదు.

బాల‌కృష్ణ‌కు డైలాగ్స్ ఫ‌స్ట్ ఎక్క‌డ చెప్పారు. చెప్పిన‌ప్పుడు రియాక్ష‌న్ ఏమిటి..?

మొరాకోలో బాల‌కృష్ణ గార్కి డైలాగ్స్ చెప్పాను. 99 సినిమాలు పూర్తి చేసారు. బాల‌కృష్ణ గారు ఎంతో మంది ర‌చ‌యిత‌ల‌ను చూసుంటారు. నా డైలాగ్స్ న‌చ్చుతాయో లేదో అనుకున్నాను. నా డైలాగ్స్ విన్న వెంట‌నే బాగున్నాయి అన్నారు ఎక్క‌డా ఇది మార్చండి అని చెప్ప‌లేదు.

ఈ చిత్రంలో బాల‌కృష్ణ త‌న‌యుడు మోక్ష‌జ్ఞ న‌టించారా..?

ఈ సినిమా సీతారామ‌శాస్త్రి గారితో క‌లిసి చూసాను. చాలా బాగా వ‌చ్చింది. మోక్ష‌జ్ఞ ఈ సినిమాలో న‌టించ‌లేదు.

ఇప్ప‌టి వ‌ర‌కు క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు వ‌ర్క్ చేసారు. ఫ‌స్ట్ టైమ్ హిస్టారిక‌ల్ మూవీకి వ‌ర్క్ చేసారు క‌దా..! డైలాగ్స్ ఏ త‌ర‌హాలో ఉంటాయి..?

అప్ప‌టి తెలుగులో డైలాగ్స్ రాస్తే...ఎవ‌రికీ అర్ధం కావు. 25 ఏళ్ల క్రితం తెలుగు మాట్లాడితేనే ఏ భాష అని అడుగుతున్నారు. ఇక అప్ప‌టి తెలుగులో డైలాగ్స్ రాస్తే ఏ భాష అంటారు. అందుచేత అంద‌మైన‌, అంద‌రికీ అర్ధ‌మ‌య్యే భాష‌లోనే రాసాను.

గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి క‌థలో ఏం చెబుతున్నారు..?

ఇది శాత‌క‌ర్ణి చేసిన యుద్ధం క‌థ‌. అన్ని రాజ్యాలు క‌లిపి ఒక దేశంగా చేసిన క‌థ ఇది. ఆయ‌న గుర్రాలు మూడు స‌ముద్రాల నీళ్లు తాగాయ‌ట‌. దీనిని బ‌ట్టి అర్ధం చేసుకోవ‌చ్చు శాత‌క‌ర్ణి ఎంత‌లా జ‌ర్నీ చేసారో..! ఇంకా చెప్పాలంటే శాత‌క‌ర్ణి విజ‌య‌గాథ‌.

హేమ‌మాలిని లేక‌పోతే ఈ సినిమా లేదు అని బాల‌కృష్ణ అన్నారు. మీరేమంటారు..?

హేమ‌మాలిని గారు గురించి ఓ విష‌యం చెబుతాను. తెలుగు రాని ఆర్టిస్ట్ ల‌కు తెలుగు డైలాగ్స్ ను ఇంగ్లీషులో రాసి ఇస్తుంటారు. అయితే..హేమ‌మాలిని గారు ఇంగ్లీషులో రాసి ఇవ్వ‌న‌వ‌స‌రం లేదు. డైలాగ్ భావం ఏమిటో త‌మిళ్ లో చెప్పండి నేను తెలుగులో చెబుతాను అన్నారు. ఆమె పాత్ర అద్భుతంగా ఉంటుంది.

ఖైదీ నెం 150, గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి ఈ రెండు చిత్రాల్లో సంక్రాంతికి విజేత‌గా నిలిచేది ఎవ‌రు..?

చాలా సంవ‌త్స‌రాల త‌ర్వాత సంక్రాంతికి చిరంజీవి గారు, బాల‌కృష్ణ గారు న‌టించిన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇలాంటి సంక్రాంతి మ‌ళ్లీ రాదు. ఇక సినిమాల స‌క్సెస్ విష‌యానికి వ‌స్తే...తెల్ల కాగితం పై రాసిస్తున్నాను ఖ‌చ్చితంగా ఈ రెండు సినిమాలు సూప‌ర్ హిట్ అవుతాయి

తదుప‌రి చిత్రాల వివ‌రాలు...?

సావిత్ర జీవిత క‌థ ఆధారంగా రూపొందుతున్న సినిమా చేస్తున్నాను. మంజుల ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ చేస్తున్న సినిమా చేస్తున్నాను. అలాగే క్రిష్ త‌దుప‌రి చిత్రం కూడా చేస్తున్నాను.