ఎన్టీఆర్ , త్రివిక్రమ్ మూవీపై క్లారిటీ ఇచ్చిన రచయిత

  • IndiaGlitz, [Monday,February 12 2018]

నవలల ఆధారంగా సినిమాలను తెరకెక్కించడం తెలుగు సినీ పరిశ్రమ దర్శకులకి అలవాటే. న‌వ‌ల‌ల ఆధారంగా రూపొందిన ఎన్నో చిత్రాలు మంచి విజ‌యం సాధించాయి కూడా. కాని ఈ మధ్య ఆ ట్రెండ్ కాస్త త‌గ్గింద‌నే చెప్పాలి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న సినిమాని కూడా నవలాధారంగా రూపొందిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ రచయిత్రి సులోచనా రాణి, రచయిత మధుబాబు పేర్లు వినిపించాయి.

అయితే ఇటీవల యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తాను రచించిన నవలాధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుందన్న విషయాన్ని ఖండించారు రచయిత మధుబాబు. ఈ విషయమై త్రివిక్రమ్ గాని, చిత్ర యూనిట్ గాని తనను సంప్రదించలేదని కూడా ఆయ‌న స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ మూవీ మార్చి నెల నుంచి నిరవధికంగా చిత్రీకరణ జరుపుకోనుంది. హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నఈ చిత్రానికి సంబంధించిన న‌టీన‌టుల‌, సాంకేతిక నిపుణుల ఎంపిక ప్ర‌స్తుతం జ‌రుగుతోంది.