అంతా నా పుస్తకంలో వున్నట్లే, రవితేజ ‘‘క్రాక్’’ కథ నాదే .. పోలీసులకు రచయిత ఫిర్యాదు
- IndiaGlitz, [Friday,May 13 2022]
రవితేజ, శృతిహాసన్‌లు హీరో హీరోయిన్లుగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ‘‘క్రాక్’’ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వరుస ఫ్లాప్‌లతో నిరాశలో వున్న రవితేజకు ఈ సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది. రవితేజ నటన, శృతిహాసన్ అందం, యాక్షన్ సీక్వెన్స్‌లు, పాటలకు ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. ఈ సినిమా విజయం ఇచ్చిన జోష్‌లోనే రవితేజ వరుస పెట్టి ప్రాజెక్ట్‌లు అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఖిలాడిని దించిన ఆయన.. ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రావణసుర సినిమాలు చేస్తున్నారు. అయితే విడుదలైన ఏడాదికి.. అంతా మరిచిపోయిన తర్వాత క్రాక్ సినిమాపై వివాదం రాజుకుంది.
ఈ సినిమా కథ తనదేనని తనను మోసం చేసిన సినీ నిర్మాతతో పాటు యూనిట్‌పై చీటింగ్ కేసు నమోదు చేయాలని ఓ రచయిత జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆల్వాల్‌కు చెందిన శివ సుబ్రమణ్యమూర్తి అనే వ్యక్తి 2015లో బళ్లెం సినిమా మీడియా డైరెక్టరీ అనే పుస్తకాన్ని రాశారు. గతేడాది రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమాలోని సన్నివేశాలు, కథ, కథనం మొత్తం తన పుస్తకం నుంచి కాపీ కొట్టారని ఆయన ఆరోపిస్తున్నారు.
దీంతో సదరు నిర్మాణ సంస్థతో పాటు దర్శకుడు, హీరోలకు ఫిలించాంబర్ నుంచి నోటీసులు పంపించినా పట్టించుకోలేదని శివ సుబ్రమణ్యమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. క్రాక్ చిత్ర నిర్మాత మధుసూదన్‌రెడ్డి జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్‌నగర్‌లో నివసిస్తుండటంతో తాను ఇక్కడ ఫిర్యాదు చేసినట్లు శివ సుబ్రమణ్యమూర్తి తెలిపారు. మరి ఇందులో నిజమెంత వుందో తెలియాలంటే చిత్ర యూనిట్ స్పందించాల్సిందే.