హైదరాబాద్ అస్తవ్యస్తం.. 100 ఏళ్లలో ఇదే తొలిసారి..
Send us your feedback to audioarticles@vaarta.com
భారీ వర్షాలతో హైదరాబాద్ అస్తవ్యస్తమైంది. భారీ వృక్షాలు సైతం నేలకొరగాయి. విద్యుత్, టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఆన్‌లైన్ తరగతులకు సైతం విద్యాసంస్థలు సెలవులు ప్రకటించాయి. ఈ మూడు రోజులూ అత్యవసరమైతేనే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. వరద ఉధృతికి పలు చోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. వంద ఏళ్లలో ఇంతటి ఘోర పరిస్థితిని హైదరాబాద్ చవిచూడటం ఇదే తొలిసారని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అత్యవసర సేవల కోసం సంప్రదించాల్సిన నంబర్లను అధికారులు ప్రకటించారు.
అత్యవసర సేవల కోసం 040 - 211111111
జీహెచ్‌ఎంసీ విపత్తు నిర్వహణ శాఖ - 90001 13667, 97046 01866
జీహెచ్‌ఎంసీ పరిధిలో చెట్లు తొలగించే సిబ్బంది కోసం 63090 62583
జీహెచ్‌ఎంసీ విద్యుత్ శాఖ- 94408 13750
ఎన్‌డీఆర్‌ఎఫ్ సేవల కోసం 83330 68536, 040 2955 5500
రంగంలోకి దిగిన ఆర్మీ హెలికాఫ్టర్..
మరోవైపు.. మూసీ నది ప్రమాదకర స్థాయిలో ప్రహహిస్తోంది. చాదర్‌ఘాట్ వద్ద పది అడుగుల మేర నీటి ప్రవాహం వచ్చి చేరింది. మూసానగర్, శంకర్ నగర్, కమల్‌నగర్ పూర్తిగా నీట మునిగాయి.
ఇళ్లలోకి నీరు చేరటంతో ప్రజలు డాబాలపైకి చేరారు. చాదర్‌ఘాట్ దగ్గర కొత్త వంతెనపై నుంచి వరద ప్రవహిస్తోంది. కోఠి, దిల్‌సుఖ్‌నగర్‌కు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. మొత్తానికి హైదరాబాద్‌లో భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. పాతబస్తీలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. చాంద్రాయణగుట్టలో ఆర్మీ హెలికాఫ్టర్ రంగంలోకి దిగింది. ఫలక్‌నుమా పరిసరాల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది.
వర్షాలపై కేటీఆర్ సమీక్ష..
హైదరాబాద్‌లో భారీవర్షాలపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. సీఎస్, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి కలెక్టర్‌లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరరేటర్లకు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రభావిత ప్రాంత ప్రజలను కమ్యూనిటీ హాళ్లకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ సంస్థలతో సమన్వయం చేసుకుని కరెంట్‌ను పునరుద్ధరించాలని సూచించారు. ఓపెన్ నాలాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ, డిజాస్టర్ రెస్పాన్స్‌ఫోర్స్ అంతా వాతావరణశాఖతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని కేటీఆర్ సూచించారు.
ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దు: సజ్జనార్
శంషాబాద్ గగన్‌పహాడ్ వద్ద అప్పచెరువు తెగిపోవడంతో ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోయి దుర్మరణం పాలయ్యారు. పదుల సంఖ్యలో వాహనాలు కొట్టుకుపోయాయి. ఎయిర్‌పోర్టుకు వెళ్లే వాహనాలు సైతం కొట్టుకుపోయాయి. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఎయిర్‌పోర్టు, కర్నూలు వైపు వెళ్లే వారు ఓఆర్‌ఆర్‌ను వాడాలన్నారు. క్లిష్ట సమయంలో అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. ఎలాంటి ఇబ్బంది కలిగినా 9490617444 కాల్ చేయండని సజ్జనార్ సూచించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments