హైదరాబాద్: ప్రపంచంలో అతిపెద్ద ధ్యాన కేంద్రం
- IndiaGlitz, [Saturday,January 25 2020]
భాగ్యనగరం (హైదరాబాద్) అనేక శతాబ్దాల చరిత్రకు అనవాలు అన్న విషయం తెలిసిందే. ఒక్క మాటలో చెప్పాలంటే జాతీయంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కిన వాటికి హైదరాబాద్ ప్రత్యేకతల సమాహారంని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చార్మినార్‌తో పాటు పలు ప్రసిద్ధ కట్టడాలు, పార్కులు ఇలా చెప్పుకుంటో హైదరాబాద్‌కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే.. ఈ జాబితాలో మరో ప్రత్యేకత చేరబోతున్నది. ఈ చేరికతో భాగ్యనగరం పేరు ప్రపంచ వ్యాప్తంగా మరోసారి మార్మోగనుందని చెప్పవచ్చు. ఇంతకీ ఆ ప్రత్యేకత ఏంటి..? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
అసలేంటి ఆ ప్రత్యేకత!
మునుపెన్నడూ ప్రపంచంలోనే లేని అతిపెద్ద ధ్యానకేంద్రాన్ని హైదరాబాద్ శివారులోని నందిగామలో హార్ట్ఫుల్నెస్ సంస్థ ఏర్పాటు చేయనుంది. ఈ కన్హాశాంతివనాన్ని ఈ నెల 28న ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్, హార్ట్ఫుల్నెస్ గ్లోబల్ గైడ్ దాజీలు ప్రారంభించనున్నారు. ఇందులో ఒకే సారి లక్ష మంది ఉమ్మడిగా ధ్యానం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. తాబేలు (కూర్మావతరం)ఆకారంలో నిర్మించిన ఈ ధ్యానకేంద్రం ఉంటుంది. ఒకేసారి 40వేల మంది ధ్యానం చేయనున్నారు. 30 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాగా.. ప్రపంచంలోనే ఇదే అతి పెద్ద తపో కేంద్రం కావడం విశేషం అని చెప్పుకోవచ్చు.
అందులో ఏమేం ఉన్నాయ్!
- ఈ ధ్యానకేంద్రం రాత్రిపూట కాంతుల్లో తళుక్కుమని మెరుస్తూ సిడ్నీహార్బర్‌లా కనిపిస్తుంది.
- ఒకేసారి 40 వేల మందికి అతిథ్యమిచ్చే క్యాంపస్
- రోజుకు లక్ష మందికి భోజనాలు పెట్టే వంటగదులు
- 350 పడకల సామర్థ్యం గల ఆయుష్ దవాఖాన
- 6 లక్షల మొక్కలతో కూడిన నర్సరీలు
అతిథులు వీరే..!
ఇదిలా ఉంటే.. కన్హా శాంతివనం ప్రారంభోత్సవం సందర్భంగా మూడు రోజుల చొప్పున మూడు విడుతల్లో పలు కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ ప్రారంభోత్సవంలో రాష్ట్రపతి రాంనాథ్‌కోవింద్, బాబా రాందేవ్, పలు రాష్ర్టాల గవర్నర్లు, సామాజిక కార్యకర్త అన్నాహజారే సైతం పాల్గొనబోతున్నారు.