Download App

World Famous Lover Review

న‌వ‌త‌రం క‌థానాయకుల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ.. `పెళ్ళిచూపులు`, `అర్జున్ రెడ్డి`, `గీత గోవిందం` వంటి చిత్రాల‌తో యూత్‌లో మంచి క్రేజ్‌ను ద‌క్కించుకున్నాడు. మ‌ధ్య‌లో ఈ హీరో న‌టించిన `నోటా`, `డియర్ కామ్రేడ్` చిత్రాలు స‌క్సెస్ కాక‌పోయినా.. యూత్‌లో త‌న క్రేజ్‌ను త‌గ్గ‌కుండా ఉండేలా చూసుకోవ‌డం విజ‌య్ స‌క్సెస్ అయ్యాడు. ఇప్ప‌టి వ‌ర‌కు విజ‌య్ చేసినవ‌న్నీ డిఫ‌రెంట్ ప్రేమ‌క‌థ‌లే.. అలాంటి మ‌రో ప్రేమ‌క‌థా చిత్రం `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌`తో ప్రేమికుల రోజున ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. న‌లుగురు అమ్మాయిలు.. ఒక అబ్బాయి న‌డిచే చిత్ర‌మిది. విజ‌య్ తొలిసారి మూడు వేరియేషన్స్ ఉన్న పాత్ర‌లో న‌టించాడు. తాను చేసిన చివ‌రి ల‌వ్‌స్టోరీ ఇది అని.. ఇక‌పై ప్రేమ‌క‌థా చిత్రాలు చేయ‌మ‌న‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు. మ‌రి విజ‌య్ అంతగా స్టేట్‌మెంట్ ఇవ్వ‌డానికి కార‌ణ‌మేంటి? అస‌లు వ‌రల్డ్‌ఫేమ‌స్ ల‌వ‌ర్ క‌థేంటి?  విజ‌య్ ఎలా వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ అయ్యాడు?  న‌లుగురు హీరోయిన్స్‌, హీరో మ‌ధ్య కెమిస్ట్రీ ఎలా ఉంది? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

క‌థ‌:

ఎంబీఏ చ‌దివే స‌మ‌యంలో గౌత‌మ్‌(విజ‌య్ దేర‌వ‌కొండ సాయి)కి యామిని(రాశీఖ‌న్నా)  ప‌రిచ‌యం అవుతుంది. ఆ ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారుతుంది. యామినీ కోటీశ్వ‌రురాలు. తండ్రి గౌత‌మ్‌తో పెళ్లిని వ్య‌తిరేకించినా ఇష్ట‌ప‌డి గౌత‌మ్‌తోనే వ‌చ్చేస్తుంది. ఇద్ద‌రూ లివ్ ఇన్ రిలేష‌న్ షిప్ చేస్తుంటారు. అయితే గౌత‌మ్‌కి జాబ్ కంటే రైట‌ర్ కావాల‌నే కోరిక‌. దాంతో ఉన్న ఉద్యోగాన్ని కూడా వ‌దిలేని ఇంట్లోనే కూర్చుంటాడు. ఏడాదిన్న‌ర పాటు ఇంట్లోనే ఉండే గౌత‌మ్‌.. త‌న లోకంలోనే ఉంటూ, యామినీని ప‌ట్టించుకోడు. అత‌ని ప్ర‌వ‌ర్త‌న‌తో విసిగిపోయిన యామినీ చివ‌ర‌కు బ్రేక‌ప్ అని చెప్పేసి వెళ్లిపోతుంది. గౌత‌మ్ ఆమెను ఎంతో బతిమాలుకుంటాడు. ఆమె ఆలోచ‌న‌ల‌తో ఉంటుంటాడు. చివ‌ర‌కు గౌత‌మ్ ర‌చ‌యిత‌గా స‌క్సెస్ అవుతాడా?  అస‌లు వ‌రల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ ఎవ‌రు?  గౌత‌మ్, యామినీ లైఫ్‌లో శీనయ్య, సువర్ణ, శ్వేత, ఇజాబెల్లెలెయితెల‌కు ఉన్న సంబంధ‌మేంటి? అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే...

స‌మీక్ష‌:

కెరీర్ ప్రారంభంలోనే మూడు క్యారెక్టర్స్‌, నాలుగు ప్రేమ‌క‌థ‌లున్న సినిమాలో న‌టించడం కాస్త క‌ష్ట‌మైన ప‌నే. కానీ విజ‌య్ దేవ‌ర‌కొండ అలాంటి ఆలోచ‌న‌తో ముందుకు రావ‌డం మంచిదే. నాలుగు ప్రేమ‌క‌థ‌ల‌ను కొత్త కోణాల్లో ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం జ‌రిగింది. బేసిక్ ప్రేమ‌క‌థ దాని చుట్టు మిగిలిన మూడు ప్రేమ‌క‌థ‌లు ఉండేలా డైరెక్ట‌ర్ క్రాంతి మాధ‌వ్ క‌థ‌ను రాసుకున్నాడు. ప్ర‌ధాన‌మైన ప్రేమ‌క‌థ‌, గౌత‌మ్‌-యామినీ అనే రెండు పాత్ర‌ల మ‌ధ్య ఎమోష‌న‌ల్‌గా సాగుతుంది. ఈ రెండు పాత్ర‌లతో ప్రేమ‌లో ఉండే త్యాగం, రాజీత‌త్వం, దైవ‌త్వం అనే అంశాల‌ను ఉదాహ‌రించే ప్ర‌య‌త్నాన్ని చేశాడు ద‌ర్శ‌కుడు క్రాంతి మాధ‌వ్‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఎమోష‌న‌ల్ కంటెంట్ సినిమాల‌ను తెర‌కెక్కించి ద‌ర్శ‌కుడిగా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న క్రాంతి మాధ‌వ్ ఈ సినిమాను కూడా అలాంటి త‌ర‌హాలోనే తెర‌కెక్కించాడు.

న‌టీన‌టుల పరంగా చూస్తే విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మూడు క్యారెక్ట‌ర్స్‌..నాలుగు ప్రేమ‌క‌థ‌ల్లోని పాత్ర‌ల‌ను అద్భుతంగా పోషించాడు. వీటిలో ఇల్లెందు బొగ్గు గ‌ని కార్మికుడు శీన‌య్య పాత్ర‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌ట‌న సింప్లీ సూప‌ర్బ్‌. అలా జీవించేశాడ‌ని చెప్పాలి. ఆ పాత్ర‌కు భార్యగా క‌న‌ప‌డ‌ని ఐశ్వ‌ర్య రాజేష్ త‌న పాత్ర‌ను అద్భుతంగా, స‌హ‌జంగా క్యారీ చేసింది. ఇక ఈ ఎపిసోడ్‌లో క‌నిపించే క్యాథ‌రిన్ పాత్ర ప‌రిధి మేర చ‌క్క‌గా న‌టించింది. ఇక ఫ్రాన్స్ ఏపిసోడ్‌లో విజ‌య్‌దేవ‌ర‌కొం, ఇజా బెల్లా లెయితే ఎపిసోడ్ చివ‌ర ట్విస్ట్ బావుంటుంది. కానీ అక్క‌డ లాజిక్ మిస్స‌య్యాడా ద‌ర్శ‌కుడు అనిపిస్తుంది. అదేంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఇక విజ‌య్‌-రాశీ మ‌ధ్య అంతా ఎమోష‌న‌ల్ ఎపిసోడ్ మాత్ర‌మే ర‌న్ అవుతుంది. ఈ ఏపిసోడ్‌లో విజ‌య్‌ను చూస్తుంటే అర్జున్ రెడ్డిలో హీరోని చూస్తున్న‌ట్లు అనిపిస్తుంది. ఇక జ‌య‌ప్ర‌కాశ్ తండ్రి పాత్ర‌లో త‌న‌దైన న్యాయం చేయగా..ప్రియ‌దర్శి పాత్ర ప‌రిమిత‌మైనా, చ‌క్క‌గా న‌టించాడు. శ‌త్రు స‌హా ఇత‌ర పాత్ర‌ధారులంద‌రూ వారి వారి పాత్ర‌ల ప‌రిధుల మేర‌కు చ‌క్క‌గా న‌టించారు. ద‌ర్శ‌కుడు ఫ‌స్టాఫ్‌ను న‌డిపిన తీరులో సెకండాఫ్‌ను ర‌న్ చేయ‌లేక‌పోయాడ‌నిపించింది. ముఖ్యంగా సెకండాఫ్ కాస్త సాగ‌దీత‌గా, బోరింగ్‌గా అనిపిస్తుంది. ఎమోష‌న‌ల్ సీన్స్ ఎందుక‌నో క‌నెక్ట్ కావు. ఎక్క‌డో ఎమోష‌న్ మిస్ అయిన భావ‌న క‌లుగుతుంది. అలాగే క్లైమాక్స్ రొటీన్‌గా, డ్రెమ‌టిక్‌గా అనిపిస్తుంది. గోపీసుంద‌ర్ పాట‌ల్లో బొగ్గు గ‌నిలో.. పాట త‌ప్ప మ‌రేవీ ఆక‌ట్టుకోవు. నేప‌థ్య సంగీతం పెద్ద‌గా బాగా లేదు. జ‌య‌కృష్ణ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. మొత్తంగా విజ‌య్ దేవ‌ర‌కొండ మీద అభిమానంతో ఓ సారి సినిమా చూస్తే చూడొచ్చు అంతే!.

బోట‌మ్ లైన్‌: 'వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌'.... టైటిల్‌లో ఉన్నంత ఫేమ‌స్ అయితే మాత్రం కాడు

Read World Famous Lover Movie Review in English

Rating : 2.5 / 5.0